Breaking Newshome page sliderHome Page SliderTelangana

సిరిసిల్ల పై ఇంకెంతకాలం ఈ వివక్ష?

సిరిసిల్ల ‘మెగా పవర్ లూమ్ క్లస్టర్’ మంజూరు విషయంలో కేంద్రప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర టెక్స్‌టైల్స్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు ఆయన లేఖ రాశారు. సిరిసిల్లలో మెగా క్లస్టర్ ఏర్పాటు కోసం గత పదేళ్లలో అరుణ్ జైట్లీ, స్మృతి ఇరానీ నుంచి నేటి మంత్రుల వరకు సుమారు పదిసార్లు స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశామని , అన్ని అర్హతలు ఉన్నాయని కేంద్ర బృందాలే ధ్రువీకరించినా, ఫైళ్లను పక్కన పెట్టడం వెనుక ఉన్న మర్మమేమిటని కేటీఆర్ నిలదీశారు.

తెలంగాణ వస్త్ర పరిశ్రమకు సిరిసిల్ల గుండెకాయ వంటిదని, అక్కడ 30 వేలకు పైగా పవర్ లూమ్స్ ఉండి వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నాయని కేటీఆర్ గుర్తుచేశారు. సిరిసిల్ల కంటే తక్కువ సామర్థ్యం ఉన్న ఇతర రాష్ట్రాల ప్రాంతాలకు క్లస్టర్లు మంజూరు చేసిన కేంద్రం, తెలంగాణపై మాత్రం కక్ష సాధిస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో భూమి, విద్యుత్, నీరు వంటి అన్ని వసతులు సిద్ధం చేసినా, కేంద్రం కొర్రీలు పెట్టడం సిగ్గుచేటని ఎండగట్టారు. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ నినాదాలు కేవలం ప్రసంగాలకే పరిమితమయ్యాయని విమర్శించారు.

రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచినా, కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు ప్రాతినిధ్యం ఉన్నా,సిరిసిల్ల నేతన్నల గోడును కేంద్రానికి వినిపించడంలో వారు ఘోరంగా విఫలమయ్యారని కేటీఆర్ ఆరోపించారు. వీరంతా కేవలం ఉత్సవ విగ్రహాల్లా మారారని, ఓట్ల కోసం తప్ప నిధుల సాధనలో చేతులెత్తేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, మళ్లీ ఆత్మహత్యల వార్తలు వినాల్సి రావడం బాధాకరమన్నారు.

రాబోయే కేంద్ర బడ్జెట్‌లోనైనా సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను అధికారికంగా ప్రకటించి, ఈ పదేళ్ల అన్యాయానికి ముగింపు పలకాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సహకార సమాఖ్య స్ఫూర్తితో రాజకీయాలకు అతీతంగా నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో నేతన్నల ఆవేదన ఆగ్రహంగా మారి కేంద్రానికి గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు.