లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచే సీట్లెన్ని..!?
బళ్లు ఓడలు, ఓడలు బళ్లు అంటే ఇదేనేమో అని అనుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ ఉద్యమంతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన గులాబీ బాస్.. తెలంగాణను బాగు చేసుకున్నామని, ఇకపై తమ దృష్టంతా దేశంపైనే అంటూ పెద్ద ఎత్తున లెక్చర్లిచ్చారు. తెలంగాణలో విజయం తనకు నల్లేరుపై నడకేనని ఆయన అనుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత రాష్ట్ర సమితిగా కూడా మార్చేశారు. మొదట్లో పేరు మార్చడం వల్ల అడ్వాంటేజ్ అని అందరూ అనుకున్నారు. కానీ పేరు మార్పే ఆ పార్టీకి శాపంలా మారిందా అన్న చర్చ సాగుతోంది. తెలంగాణ పేరును తీసేసిన తర్వాత, ఇక ఆ పార్టీ పనైపోయిందని ప్రత్యర్థులు కాలుదువ్వుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితేంటన్నదానిపై ఎంతో అయోమయం నెలకొంది. వచ్చే ఎన్నికల్లో కారు పార్టీ వైట్ వాష్ తప్పదా అన్న భావన కలుగుతోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమిపాలైన బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు సత్తా చాటుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించకుంటే ఏం జరుగుతుందో ఆ పార్టీకి మాబాగా తెలుసు. అందుకే ఈ లోక్ సభ ఎన్నికల్లో కీలక స్థానాల్లో విజయం సాధించాలని కారు పార్టీ భావిస్తోంది. అయితే ఓవైపు అధికార కాంగ్రెస్, జాతీయ స్థాయిలో వస్తున్న క్రేజ్‌తో బీజేపీ.. తెలంగాణలోని కీలక స్థానాల్లో విజయం సాధించాలని తహతహలాడుతున్నాయ్. గత అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీ 39 స్థానాలకు పరిమితం కాగా, ఆ పార్టీ సాధించిన మెజార్టీ సీట్లు గ్రేటర్ హైదరాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలవే కావడంతో, ఈ ప్రాంతాల్లో ఇప్పుడు బీజేపీ బలంగా ఉందన్న అభిప్రాయం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ గ్రేటర్ పరిధిలోని సీట్లపై కన్నేసింది. ఇక తెలంగాణ రూరల్ అంతటా కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతోంది. గెలిచే సీట్లు లక్ష్యంగా ఆ పార్టీ నేతలు అడుగులు వేస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల అయిన వెంటనే కేసీఆర్ అనారోగ్యంతో ఆసుపత్రి పాలవడం, ఇప్పుడిప్పుడే ఆయన పార్టీ కార్యాలయానికి రావడంతో, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ముఖ్యలతో కేసీఆర్ మంతనాలు జరుపుతున్నారు. ఎన్నికల్లో విజయాల ద్వారానే.. పార్టీ అధినేతకుగానీ, పార్టీకిగానీ గుర్తింపు ఉంటుందని తెలుసు. ఎన్నికల్లో ఓడితే ఎదురయ్యే సవాళ్లతో బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికలుగుతోంది. అందుకే లోక్ సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలుచుకుంటే.. వచ్చే రోజుల్లో రాజకీయం చేయడం తేలికవుతుందని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే బలమైన అభ్యర్థుల్ని బరిలో దించాలని భావిస్తోంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో సారు, కారు, సర్కారు 16 నినాదంతో రంకెలు వేసిన పార్టీ.. ఇప్పుడు ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తామా అన్న మీమాంశలో ఉంది. గౌరవప్రదమైన స్థానాల్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు సీట్లను సాధిస్తుందన్నదానిపై బీఆర్ఎస్ గెలుపు ఆధారపడి ఉంది. రూరల్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పట్టు నిలబెట్టుకుంటే, ఇక బీఆర్ఎస్ గెలిచేదెక్కడా అన్న అభిప్రాయం ఉంది.

ఓవైపు బిజెపి 10స్థానాల్లో గెలవాలని టార్గెట్ పెట్టుకుంటే, కాంగ్రెస్ పార్టీ కనీసం 13 స్థానాల్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకొంది. మొత్తంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో గౌరవప్రదమైన సీట్లలో విజయం కోసం ప్రయత్నిస్తోంది. ఉమ్మడి మెదక్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లోని నాలుగు సీట్లను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకొంది. గతంలో సిట్టింగ్ స్థానాలను దక్కించుకోవడం ద్వారా.. తెలంగాణలో కేసీఆర్‌పై ప్రజల్లో అభిమానం తగ్గలేదని దేశ వ్యాప్తంగా చాటాలని ఆ పార్టీ భావిస్తోంది. ఓవైపు వచ్చే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి అసలైన ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ భావిస్తున్న తరుణంలో లోక్ సభ ఎన్నికల్లో తేడా వస్తే బీఆర్ఎస్ పార్టీకి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న నానుడి తప్పదు. ఓవైపు రేవంత్ రెడ్డి దూకుడు, మరోవైపు బీజేపీ తెలంగాణలో బలపడటం రెండూ కూడా కారు పార్టీకి ప్రతికూలంగా మారతాయి. కీలక స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తే… ఆ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా పనిచేసే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా మోదీ జమానా ఈసారి ఒక రేంజ్ లో ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమౌతుంది.

