ఎంతమంది ఆడపిల్లలను బలి కోరతారు: రోజా
అమరావతిలో టీడీపీకి చెందిన కార్యకర్త, రౌడీ షీటర్ దాడిలో సహానా అనే యువతి దారుణంగా హత్య గావింపబడ్డది, ఈ చర్య అత్యంత దారుణమని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా ఆరోపించారు. ఇంకా ఎంతమంది ఆడబిడ్డలను బలి తీసుకుంటారని ఆమె ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో రౌడీషీటర్ బరితెగించి హత్య చేయడంపై ఆమె ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ హత్య ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనని పేర్కొన్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ సహాన మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత హత్యకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దాడి అనంతరం మూడు రోజులుగా మృత్యువుతో పోరాడిన సహానకు మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి, హోంమంత్రి వెళ్లి డాక్టర్లకు చెప్పకపోవడం కూడా పెద్ద తప్పేనని రోజా పేర్కొన్నారు. టీడీపీ నేతలు, రౌడీ షీటర్ల నుండి మహిళల మాన, ప్రాణాలకు ముప్పు ఉందని, తక్షణమే సహానాను హత్య చేసిన టీడీపీ రౌడీ షీటర్ నవీన్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సహాన ఆత్మకు శాంతికలగాలని భగవంతుడిని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.


 
							 
							