HealthLifestyleTrending Today

పెయిన్ కిల్లర్స్ నొప్పిని ఎలా తగ్గిస్తాయి? మీకు తెలుసా?

నొప్పి అనేది శరీరంలో ఏదో అసహజమైనది జరుగుతోందని శరీరం మనకు తెలియజేసే ఒక హెచ్చరిక. దాన్ని నిర్లక్ష్యం చేస్తే, ఆ సమస్య ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో అది ప్రాణాపాయానికి కూడా దారి తీసే అవకాశం ఉంది. అలా అని నొప్పిని తగ్గిస్తూ ఉంటే సరిపోదు, దానికి వెనుక కారణాన్ని పరిష్కరించాలి. తలనొప్పి, ఒళ్లు నొప్పి, నడుము నొప్పి దేనికైనా మందు ఒక్కటే అదే పెయిన్ కిల్లర్. అది వేసుకున్న అరగంట లోపు నొప్పి తగ్గిపోతుంది. కానీ ఎలా? అసలు పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు నొప్పిని ఎలా తగ్గిస్తాయి?

శరీరంలో ఎక్కడైనా దెబ్బ తగిలిన, లేక గాయమైనా ఆ ప్రదేశంలో దెబ్బ తిన్న నోస్ రిసెప్టర్స్ అనే నాడి కణాజాలం ప్రోస్టో గ్లాండిన్స్ అనే పదార్థాన్ని విడుదల చేస్తుంది. ఈ ప్రోస్టో గ్లాండిన్స్ విడుదల కావడానికి నాడి కణాల్లోని సైక్లో ఆక్సిజనాన్సిన్ 1 అండ్ 2 ఎంజైమ్ లదే ప్రధాన పాత్ర. వీటినే కాక్స్ 1 అండ్ కాక్స్ 2 ఎంజైమ్స్ అని కూడా అంటారు. ఈ ప్రోస్టో గ్లాండిన్స్ కణాలు నాడుల ద్వారా ప్రయాణించి మెదడును చేరుతాయి. అక్కడ మెదడులోని కార్టెక్స్ భాగంలో ఉండే కణాలకు దెబ్బ తగిలిన సమాచారాన్ని చేరవేస్తాయి. శరీరం గాయపడిందని తెలుసుకున్న మెదడు రక్షణ చర్యల్లో భాగంగా తెల్ల రక్త కణాలను అలర్ట్ చేసేందుకు ఆ భాగంలో నొప్పిని కలిగిస్తుంది.

అయితే ఆ నొప్పి తగ్గేందుకు తీసుకునే పెయిన్ కిల్లర్స్ ప్రధానంగా కాక్స్ 1 కాక్స్ 2 ఎంజైమ్ లపై ప్రభావం చూపిస్తుంది. సాధారణంగా పెయిన్ కిల్లర్స్ తీసుకున్నప్పుడు అదే నేరుగా మన కడుపులోకి చేరుతుంది. అక్కడ జీర్ణశయంలోని యాసిడ్స్ ఈ పెయిన్ కిల్లర్స్ ను 20% కరిగించేస్తాయి. అప్పుడు ఆ టాబ్లెట్లపై ఉండే కోటింగ్ పోతుంది. మిగిలిన లోపలి భాగం చిన్న పేగులోకి చేరుతుంది. అక్కడ పూర్తిగా జీర్ణం అవుతుంది. ఫలితంగా టాబ్లెట్లలోని ఎన్ ఎస్ ఏఐ డి డ్రగ్స్ రక్తంలోకి కలిసి నాడి కణాల సహాయంతో గాయం ఏర్పడిన ప్రదేశానికి వెళతాయి. అయితే ఇవి గాయాన్ని ఏమాత్రం తగ్గించవు. ఆ గాయమైన ప్రదేశంలోని కాక్స్ 2 ఎంజైమ్ లను నిరోధించి అవి ప్రోస్టో గ్లాడిన్స్ పదార్థాన్ని విడుదల చేయకుండా చేస్తాయి. ఫలితంగా గాయం గురించి మెదడుకు సిగ్నల్స్ అందించడం నిలిచిపోతుంది. దాంతో మెదడు ఆ ప్రాంతంలో నొప్పిని కలిగించడం ఆపేస్తుంది. ఇక ఇంజెక్షన్ల ద్వారా ఇచ్చే పెయిన్ కిల్లర్స్ నేరుగా రక్తనాళాల ద్వారా దెబ్బ తగిలిన ప్రదేశానికి ప్రయాణిస్తాయి. ఇది పెయిన్ కిల్లర్స్ వెనకున్న రహస్యం. అయితే ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప పెయిన్ కిల్లర్స్ ను తీసుకోకపోవడమే మంచిది.