జైల్లో అల్లు అర్జున్ రాత్రి ఎలా గడిచిందంటే..
పుష్ప-2 ప్రీమియర్ షో లో జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 14 రోజుల రిమాండ్ పై చంచల్ గూడ జైలుకు వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర బెయిల్ ఆదేశాలు సకాలంలో జైలు అధికారులకు చేరకపోవడంతో బన్నీ శుక్రవారం రాత్రి జైల్లోనే గడపాల్సి వచ్చింది. అయితే.. జైలులో అల్లు అర్జున్ కు ఖైదీ నంబర్ 7697ను జైలు అధికారులు కేటాయించినట్టు సమాచారం. అధికారులు భోజనం అందించినా తినలేదని, సాధారణ ఖైదీల మాదిరిగా రాత్రంతా నేలపై పడుకున్నాడని జైలు వర్గాలు చెప్పినట్టు తెలుస్తోంది.
మంజీరా బ్లాక్ లోని ప్రత్యేక బ్యారక్ ను అల్లు అర్జున్ కు కేటాయించినట్టు సమాచారం. ఆయనకు కొత్త రగ్గు, కొత్త దుప్పటి ఇచ్చారట. ఇక ముగ్గురు ఖైదీలు ఉండే బ్యారక్ ను కేటాయించారని, అందులో మరో ఇద్దరు విచారణ ఖైదీలు ఉన్నట్టు తెలుస్తోంది. రాత్రంతా నిద్ర పోకుండా అలాగే ఉన్నాడని, ఎప్పుడు విడుదల చేస్తారని మాత్రమే జైలు అధికారులతో అల్లు అర్జున్ మాట్లాడినట్టు కథనాలు వెలువడుతున్నాయి. ఎవ్వరితోనూ మాట్లాడకుండా ఉన్నాడని తెలుస్తోంది. అయితే.. హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ ఆర్డర్ కాపీ జైలు అధికారులకు అందినప్పటికీ అల్లు అర్జున్ ను రిలీజ్ చేయలేదని, దీనిపై జైలు అధికారులు సమాధానం చెప్పాలని అల్లు అర్జున్ తరపున వాదించిన అశోక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇది అక్రమ నిర్బంధమని, తాము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

