Home Page SliderNational

బుల్ డోజర్ జస్టిస్‌పై సుప్రీం కోర్టు కన్నెర్ర. ఆ కారణంతోనే కూల్చేస్తారా?

‘బుల్‌డోజర్‌ న్యాయం’పై సుప్రీంకోర్టు ఈరోజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. కేవలం ఒక నిందితుడికి లేదా క్రిమినల్‌ కేసులో దోషిగా ఉన్నందుకు ఇల్లు ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించింది. ఇళ్లను కూల్చే ముందు అనుసరించాల్సిన దేశవ్యాప్త మార్గదర్శకాల కూడా కోర్టు ప్రతిపాదించింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదిస్తూ, దేశవ్యాప్తంగా ‘బుల్డోజర్ న్యాయం’ జరగకుండా ఉండాలే కోర్టు ఆదేశాలుండాలన్నారు. నిందితుడు క్రిమినల్ నేరంలో ఉన్నందున ఎటువంటి స్థిరాస్తిని కూల్చివేయలేరని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనాన్ని ఉద్దేశించి, భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. “నిర్మాణం చట్టవిరుద్ధమైతే మాత్రమే అలాంటి కూల్చివేత జరుగుతుంది” అని సొలిసిటర్ జనరల్ మెహతా అన్నారు. అయితే, ఈ విషయాన్ని కోర్టు ముందు తప్పుగా చిత్రీకరిస్తున్నారని వాదించారు.


“మీరు దీన్ని అంగీకరిస్తే, మేము దీని ఆధారంగా మార్గదర్శకాలను జారీ చేస్తాం. వ్యక్తి నిందితుడు లేదా దోషి అయినందున కూల్చివేత ఎలా చేస్తారు” అని జస్టిస్ గవాయ్ అన్నారు. “నిర్మాణం అనధికారికంగా ఉంటే, జరిమానా విధించాలి. కొంత క్రమబద్ధీకరణ చేయాలి. అందుకు మేము ఒక విధానాన్ని రూపొందిస్తాం. మీరు మున్సిపల్ చట్టాలను ఉల్లంఘిస్తేనే కూల్చివేత అని అంటున్నారు. మార్గదర్శకాల అవసరం ఉంది, దానిని డాక్యుమెంట్ చేయాలి” అని బెంచ్ పేర్కొంది. ఇలాంటి కేసులను నివారించేందుకు ఆదేశాలు ఎందుకు జారీ చేయలేరని జస్టిస్ విశ్వనాథన్ ప్రశ్నించారు. “మొదట నోటీసు జారీ చేయండి. సమాధానం ఇవ్వడానికి సమయం ఇవ్వండి. చట్టపరమైన పరిష్కారాలను కోరడానికి సమయం ఇవ్వండి. ఆ తర్వాతే కూల్చివేయండి” అని జస్టిస్ గవాయ్ చెప్పారు.

అక్రమ నిర్మాణాన్ని సమర్థించడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. “ప్రజా రహదారులను అడ్డుకునే ఎటువంటి అక్రమ నిర్మాణాన్ని మేము రక్షించం, అందులో దేవాలయం ఉన్నా సరే, కూల్చివేతకు మార్గదర్శకాలు ఉండాలి” అని అది పేర్కొంది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు దుష్యంత్ దవే, CU సింగ్‌లు ఢిల్లీలోని జహంగీర్‌పురిలో కూల్చివేత చర్యలను ఎత్తి చూపారు. కొన్ని సందర్భాల్లో అద్దెకు ఇచ్చిన ఆస్తులను కూల్చివేసినట్లు న్యాయవాదులు తెలిపారు. “యజమాని కుమారుడు లేదా అద్దెదారు ప్రమేయం ఉన్న 50-60 ఏళ్ల క్రితం ఇళ్లను కూల్చివేశారు” అని సింగ్ చెప్పారు.

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో నివసిస్తున్న విద్యార్థి తన క్లాస్‌మేట్‌ను కత్తితో పొడిచి చంపిన తర్వాత ఒక ఇంటిని కూల్చివేషయాన్ని గుర్తు చేశారు. “ఒక వ్యక్తి కొడుకు ఇబ్బంది కలిగిస్తే, సంబంధం లేని విషయంలో ఆ వ్యక్తి ఇంటిని కూల్చివేయడం సరైన మార్గం కాదు” అని జస్టిస్ విశ్వనాథన్ అన్నారు. సెప్టెంబరు 17న మళ్లీ విచారణ జరుపుతామని తెలిపిన కోర్టు సమస్యను పరిష్కరించడానికి సూచనలను ఆహ్వానించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అఫిడవిట్‌లో చట్టం ద్వారా ఏర్పాటు చేసిన విధానం ప్రకారం మాత్రమే స్థిరాస్తిని కూల్చివేయవచ్చని జస్టిస్ గవాయ్ అన్నారు. ” పాన్-ఇండియా ప్రాతిపదికన కొన్ని మార్గదర్శకాలను రూపొందించాలని ప్రతిపాదిస్తున్నాం, తద్వారా లేవనెత్తిన ఆందోళనను క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. UP సర్కార్ వైఖరిని అభినందిస్తున్నాం.” అని ఆయన చెప్పారు.

ఒకానొక సమయంలో, కోర్టు హాలులో సొలిసిటర్ జనరల్ మెహతా, న్యాయవాది దవే మధ్య వాగ్వివాదం జరిగింది. “కొందరి విషయాలను తీసుకొని ఈ న్యాయవాదులు కోర్టు ముందుకు వచ్చారు. ఎవరి ఇళ్ళు కూల్చారో వారు మాత్రం కోర్టును సంప్రదించలేదు.” అని దవేను ఉద్దేశించి అన్నారు. ఈ విషయానని డర్టీ చేయాలనుకుంటున్నారన్నాడు. దీనిపై దవే తీవ్రంగా స్పందించారు. డర్టీ అని చెప్పకండి… మీరు ఎల్లప్పుడూ అంశం ఒకవైపు మాత్రమే చూస్తారు. మీరు సొలిసిటర్ జనరల్, అలాగే వ్యవహరించండి” అని దవే అన్నారు. దీంతో జస్టిస్ గవాయ్ జోక్యం చేసుకుని న్యాయస్థానాన్ని యుద్ధభూమిగా మార్చవద్దని సీనియర్ న్యాయవాదులకు విజ్ఞప్తి చేశారు. దేశ వ్యాప్తంగా క్రిమినల్ కేసుల్లో నిందితుల ఇళ్లను కూల్చివేయడం, అనేక ప్రాంతాల్లో ‘బుల్‌డోజర్‌ న్యాయం’ సర్వసాధారణంగా జరుగుతోంది. ఈ వ్యవహారశైలి తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఒక వ్యక్తిపై ఆరోపణలు రుజువు కాకముందే చర్య ఎలా తీసుకుంటారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఒకరి నేరానికి మొత్తం కుటుంబాన్ని ఎందుకు శిక్షిస్తారని ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.