అడ్డగోలుగా ఆక్రమణలు..ఏకంగా చెరువులోనే..
చెరువులను ఆక్రమించి కట్టడాలు కట్టడంలో తెలివిమీరిపోయారు కొందరు ఆక్రమణదారులు. హైదరాబాద్ నగరంలో ఇలాంటి ఆక్రమణలను గుర్తించి, కూల్చివేతలు చేపడుతోంది హైడ్రా. దీనితో జిల్లాలలో కూడా రెవెన్యూ అధికారులు ఆక్రమణలపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ మండలం మల్కాపుర్‌లో ఒకరు ఏకంగా చెరువులోనే బహుళ అంతస్తుల భవనాన్ని దర్జాగా కట్టుకున్నారు. ఈ విషయం రెవెన్యూ అధికారులు గుర్తించి, ఏకంగా బాంబులు పెట్టి కూల్చేశారు. ఈ అక్రమ కట్టడాన్ని నేలమట్టం చేశారు. ఈ భవనం సికింద్రాబాద్‌కు చెందిన వ్యక్తి నిర్మించినట్లు సమాచారం. వీరు తెలివిగా అసలు నీటిలో అడుగుపెట్టకుండా ఒడ్డు నుండే మెట్లను కూడా ఏర్పాటు చేసుకుని విలాసవంతమైన నాలుగంతస్తుల భవనాన్ని కట్టుకున్నారు. యజమానులు వారాంతాలలో ఇక్కడికి వచ్చి సేదతీరుతూ ఉంటారని సమాచారం. భవనం కూల్చివేసిన సందర్బంలో బాంబులు పేలి శిథిలాలు ఎగిరిపడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి.