Home Page SliderLifestyleNationalNewsviral

అందాల నీలగిరుల్లో హోమ్ స్టే భూదందాలు

. నీలగిరుల్లో కనుమరుగవుతున్న ప్రకృతి సౌందర్యం
. రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారిన ఊటీ హోమ్ స్టే వ్యాపారం
.స్థానికుల కోసం అనుమతించిన హోమ్ స్టే బిజినెస్ లోకి బడా బిజినెస్ వ్యాపారులు
. హైకోర్టు కఠిన ఆదేశాలు
. ఏటా పెరుగుతున్న సందర్శకులు
ఇంటర్నెట్ డెస్క్ : ప్రకృతి అందాలకు నెలవైన నీలగిరి కొండలు 80 వ దశకంలో తెలుగు సినిమా పాటలకు నెలవు. ఊటీలో, కొడైకెనాల్ లో చిత్రీకరించిన ఆ పాటలు, ఆ ప్రకృతి సౌందర్యాలు అప్పటి యువతను గిలిగింతలు పెట్టేవి. కానీ రాను రాను ఆ ప్రకృతి అందాలు భూ బకాసురుల కబంద హస్తాల్లో విలవిలలాడసాగాయి. ప్రకృతి సిద్దంగా దక్షిణాదిలో చల్లటి ప్రదేశాలు అరుదు. కానీ ఎత్తైన నీలగిరి కొండల ఊటీకి దక్షిణ కాశ్మీర్ అని పేరు. అంతటి చక్కటి ప్రకృతి చల్లదనం కూడా పర్యాటకుల తాకిడికి తాళలేక వేడెక్కిపోయింది. పర్యాటకులు భారీ సంఖ్యలో పెరగడంతో రవాణా సదుపాయాలు కూడా బాగా పెరిగాయి. వేసవి సెలవుల్లో కార్లు, ప్రైవేట్ వాహనాలు ఎక్కువైపోయి కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోతున్నాయి. దీనితో పర్యావరణ ప్రేమికులు గొల్లుమంటున్నారు.
దీనితో తమిళనాడు ప్రభుత్వం రంగంలోకి దిగింది. స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంచి, పర్యాటకులకు తక్కువ ధరకే వసతి, ఆహారం అందించే ఉద్దేశంతో ఉదారంగా హోమ్ స్టే లకు కొన్నేళ్ళ క్రితం అధికారికంగా అనుమతులు ఇచ్చింది. సొంత ఇళ్లను హోమ్ స్టే కు అద్దెలకు ఇవ్వదలుచుకున్నవారు తమిళనాడు ప్రభుత్వ పర్యాటక శాఖ పోర్టల్ లో నమోదు చేసుకుంటే చాలు. ఊటీ, కొడైకెనాల్లో కొన్ని వేలమంది నమోదు చేసుకున్నారు. కొన్నేళ్ళు అంతా సవ్యంగానే సాగింది. అయితే ఈ వ్యాపారం లాభసాటిగా కనబడడంతో కమర్షియల్ వెంచర్ గా మారింది. పెద్దవాళ్ళు కూడా పెద్ద పెద్ద ఇళ్ళు కట్టి…అయిదారు గదులతో హోమ్ స్టే వ్యాపారంలోకి దిగారు. లాడ్జ్ లు పోయి దాదాపు అన్నీ హోమ్ స్టే లే అయ్యాయి. పేరు మారింది కానీ మళ్ళీ అదే దోపిడీ. ఈ వ్యాపారం పోటీలో స్థానికులు తట్టుకోలేక డీలాపడ్డారు.
ఈలోపు పర్యావరణ ఉద్యమకారులు కోర్టుకెక్కారు. ఊటీ, కొడైకెనాల్లో వసతి సదుపాయాలకోసం ఏటా వేల చెట్లను కొట్టేస్తున్నారని, కొండలను తొలిచేస్తున్నారని ఆధారాలను కోర్టుకు సమర్పించారు. టూరిజం, రెవెన్యూ, స్థానిక పురపాక సంస్థల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి…ఇకపై హోమ్ స్టే లకు ఆ కమిటీ పరిశీలన తరువాతే అనుమతులివ్వాలని, ప్రస్తుతమున్న అనధికారిక హోమ్ స్టే లను అన్నిటినీ మూసేయించాలని ఆదేశించింది. దాంతో ఈ కమిటీ దాడులు చేయడం మొదలుపెడితే వందల సంఖ్యలో అనుమతుల్లేని, అక్రమ భవనాల్లో నడుపుతున్న హోమ్ స్టే ల బాగోతాలు వెలుగుచూస్తున్నాయి. అయితే ఈ దాడుల వల్ల స్థానికుల హోమ్ స్టేలు కూడా ఇబ్బందులలో పడ్డాయి. పెద్దవి పర్మిషన్లు లేక మూతపడుతున్నాయి. చిన్నవి కొత్త నిబంధనలతో పర్మిషన్లు రాక ఖాళీగా ఉన్నాయి.
తమిళనాడులోని నీలగిరీస్ వంటి ఎకో సెన్సిటివ్ జిల్లాలో హోమ్‌స్టేలు, కాటేజ్ లకు లైసెన్స్ లేకుండా, భవన అనుమతులు లేకుండా ఎక్కువ స్థాయిలో విస్తరిస్తున్నాయి. దీనితో హైకోర్ట్ ఇప్పుడు కఠిన ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యక్ష చర్యలు తీసుకుంటోంది. మనం ఇప్పటికే ఉత్తరాదిలో హిమాలయాలలో మంచు కరిగి సహజంగా ప్రవహించాల్సిన దారులను పర్యాటక కేంద్రాలుగా మలిచి డబ్బు చేసుకుంటే క్లౌడ్ బరస్ట్ వేళల్లో ఊళ్ళకు ఊళ్ళు బురదలో కొట్టుకుపోయిన దృశ్యాలు చూశాం. అలాగే దక్షిణాదిలో అలాంటి సమస్యలేమీ ఉండవు అని అనుకోవడానికి వీల్లేకుండా..ఇటీవల కేరళ వయనాడ్ కొండల్లో ఊళ్ళు బురదలో కొట్టుకుపోయిన విషాదం ఇంకా మరచిపోలేకపోతున్నాం. ఊటీ, కొడైకెనాల్ కు కూడా ఈ పరిస్థితి రాకుండా సరైన చర్యలు సత్వరమే చేపట్టాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రజల్లోనే చైతన్యం రావాలి. స్థానికులు, ప్రకృతి ప్రేమికులు నడుం బిగించాలి. ప్రభుత్వ వారికి తోడ్పాటు నివ్వాలి.