జగన్ విశాఖను రాష్ట్రరాజధాని కాదు-గంజాయికి రాజధాని చేశారు..హోం మంత్రి అనిత తీవ్ర వ్యాఖ్యలు
విశాఖలో గంజాయి వేళ్లూనుకుపోయిందని, విశాఖను రాష్ట్రరాజధానిగా చేస్తానని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్ గంజాయి రాజధానిగా చేశారని మండిపడ్డారు. గంజాయి సాగును, పంపిణీని సహించేది లేదని, దానిని ఉక్కుపాదంతో అణచివేస్తామని హోంమంత్రి అనిత హెచ్చరించారు. గంజాయి విషయంలో ఎలాంటి వారినైనా వదిలిపెట్టేది లేదని పేర్కొన్నారు.పోలీసు వ్యవస్థను గత ఐదేళ్లుగా పడుకోబెట్టేసారని, ఏమాత్రం యాక్టివ్‌గా లేదని దుయ్యబట్టారు. పోలీస్ అకాడమీ కూడా లేదని పేర్కొన్నారు. పోలీసు స్టేషన్ మెయింటెనెన్స్‌కు కూడా డబ్బు లేకుండా చేసిందని, ఐదేళ్లుగా నిధుల కొరతతో పోలీస్ స్టేషన్లు ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు.
గత ఐదేళ్లుగా వచ్చిన కేంద్ర నిధులను కూడా దారి మళ్లించారని చెప్పారు. చెక్‌పోస్టుల దగ్గర కూడా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తామని రిజర్వు పోలీసుల సహాయం కూడా తీసుకుంటామని వెల్లడించారు. రాత్రి 8 తరువాత ఏ స్టూడెంట్స్ అయినా గంజాయి ముఠాలతో సంప్రదింపులు జరిపితే కఠిన చర్యలు ఉంటాయని, డిఅడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఒరిస్సా నుండి వచ్చే గంజాయిని అడ్డుకోవడానికి అక్కడి పోలీసు వ్యవస్థతో సమన్వయం ఏర్పాటు చేసుకుంటామన్నారు. పిల్లలు, టీనేజర్లు, మహిళల ద్వారా గంజాయి పంపిణీకి ప్రయత్నిస్తే తీవ్రమైన చర్యలుంటాయని హెచ్చరించారు. గంజాయి సాగుకు గానీ, పంపిణీకి గానీ పాల్పడేవారిపై వారు ఏపార్టీ వారైనా శిక్షకు గురి కావల్సిందేనని స్పష్టం చేశారు.