అమిత్ షా ఏపీ పర్యటన వాయిదా
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆంధ్ర ప్రదేశ్ పర్యటన వాయిదా పడింది. రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలో ఈ నెల 8న పర్యటిస్తానని తొలుత ప్రచారం జరిగింది. ఇందుకోసం రాష్ట్ర నాయకత్వం సైతం విస్తృతంగా ఏర్పాట్లు మొదలు పెట్టింది. రాయలసీమ ముఖద్వారం కర్నూలుతోపాటు, హిందూపురం నియోజకవర్గం పరిధిలోని పుట్టపర్తిలో బహిరంగ సభల్లో అమిత్ షా పాల్గొంటారని పార్టీ నేతలు చెప్పారు. ఆదివారం ఉదయం కర్నూలులో బహిరంగ సభలో పాల్గొని మధ్యాహ్నం పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతారని తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు పుట్టపర్తిలో తలపెట్టిన బహిరంగ సభలో ప్రసంగిస్తారని గతంలో పార్టీ వర్గాలు వెల్లడించాయి.

అయితే ఈ పర్యటనకు అంగీకారం తెలిపిన అమిత్ షా ఆ తర్వాత అకస్మాత్తుగా వాయిదా వేస్తున్నట్లు పార్టీ రాష్ట్ర నాయకత్వానికి సమాచారం అందింది. ఐతే వాయిదా కారణాలు మాత్రం తెలియ రాలేదు. ఈ ఏడాది ఎన్నికలు జరగబోతున్న కర్నాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని ఆ తర్వాతే ఇతర రాష్ట్రాల కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ పర్యటన వాయిదా వేశారా లేక మరేదైనా ప్రత్యేక కారణం ఉన్నదా అనే విషయం స్పష్టత లేదు. పార్టీ రాష్ట్ర నాయకత్వం సైతం ఆదివారం అమిత్ షా వస్తున్నారని భారీగా ఏర్పాట్లు చేసేందుకు సమాయత్తమయ్యింది.

కానీ అకస్మాత్తుగా పర్యటన వాయిదా విషయం తెలిసి కార్యకర్తలు నిరుత్సాహానికి గురయ్యారు. వాస్తవానికి రాజమండ్రి, కాకినాడలో అమిత్ షా పర్యటన ఉండేలా రాష్ట్ర నాయకత్వం తొలుత ప్రయత్నించింది. అయితే ఈ మధ్యనే విశాఖపట్నంలో జరిగిన ఒక కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. దీంతో రాయలసీమ ప్రాంతాల్లో అమిత్ షా పర్యటన ఉంటే బావుంటుందని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సహ పలువురు రాష్ట్ర నేతలు అధిష్టానం పెద్దలకు సూచించినట్లు తెలిసింది. ఈ మేరకు రాయలసీమ పర్యటనకు అమిత్ షా ఆమోదం తెలిపి మంగళవారం ఖరారు చేసినట్టుగా తొలుత వార్తలు వచ్చాయి. కానీ చివరకు జాతీయ నాయకత్వం నుంచి పర్యటన వాయిదాపై స్పష్టతనిచ్చింది.