రంగుల వసంతోత్సవం హోలీ పండుగ
భారతదేశం అనేక సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనం. ఎన్నో మతాలు, జాతులు కలిసి వారివారి ఆచారాలను పాటిస్తూ వారి సంస్కృతిని నిలబెట్టుకుంటున్నారు. ఈ రోజు హోలీ పండుగ. హోలీ పండుగ హిందువులకు సంబంధించిన పండుగే అయినా, అన్ని మతాల వారు ఈ పండుగను సరదాగా జరుపుకుంటారు. ఎందుకంటే ఈ పండుగలో పిల్లలు, పెద్దలు రంగులు ఒకరిపై ఒకరు జల్లుకుంటూ సరదాగా గడుపుతారు. దీనిని మనదేశంలోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలలో కూడా జరుపుకుంటారు. ఇది వసంత కాలం ఆరంభంలో వస్తుంది కాబట్టి దీనిని వసంతోత్సవం అని కూడా అంటారు. ఈ పండుగ ఫాల్గుణశుద్ధ పౌర్ణమి రోజు వస్తుంది. ఈ రోజునే శ్రీమహాలక్ష్మి క్షీరసాగరం నుండి ఉద్భవించిందని పురాణ ప్రశస్తి. ఈ రోజున భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం.

హోలీ అనే పేరు హోలిక అనే రాక్షసి వల్ల వచ్చింది. ఆమె సోదరుడు హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు విష్ణు ద్వేషి. అతని కుమారుడైన ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు. అందుకే అతనిని సంహరించాలని అనేక పథకాలు వేశాడు. కానీ శ్రీమహావిష్ణువు ప్రతిసారీ ప్రహ్లాదుడిని రక్షించాడు. దీనితో ప్రహ్లాదుడిని ఎలా శిక్షించాలో తెలియని హిరణ్యకశిపుడు తన సోదరి ఐన హోలికతో ప్రహ్లాదుడితో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు. ఎందుకంటే హొలికను అగ్ని కాల్చలేదు. కానీ విష్ణు భక్తి వలన ప్రహ్లాదునికి ఏమీ కాదు. హోలిక దహనం అయిపోతుంది. ఈ సందర్భంగా ఉత్తర భారతంలో హోలీ రోజు రాత్రి హోలికా దహన కార్యక్రమం నిర్వహిస్తారు.

ఈ పండుగ రోజు ప్రజలందరూ రంగులు ఒకరిపై ఒకరు జల్లుకుంటూ ఉత్సాహంగా జరుపుకుంటారు. శ్రీకృష్ణ పరమాత్ముడు బృందావనంలో రాధతో, గోపికలతో కలిసి హోలీ ఆడాడని అంటారు. అందుకే మధుర, బృందావనంలో సుమారు 16 రోజుల పాటు హోలీ జరుపుకుంటారు.

ఈ పండుగను కామదహనం లేదా మన్మధ దహనం అని కూడా అంటారు. శివపార్వతుల కళ్యాణం జరగాలని మన్మధుడు శివునిపై పూలబాణం వేస్తాడు. దానితో ఈశ్వరుడు మూడోకన్ను తెరచి మన్మధుడిని దహిస్తాడు. అందుకే కొన్ని ప్రాంతాలలో గడ్డితో మన్మధుడి బొమ్మ చేసి మంటల్లో బొమ్మను కాల్చి ఈ పండుగ జరుపుకుంటారు. చలికాలం నుండి వేసవిలో ప్రవేశించే వసంతరుతువుకి ఆహ్వానం పలుకుతుంది ఈ వసంతోత్సవం. అందుకే జ్వరాలు, జలుబులూ రాకుండా వేప, బిల్వ, వంటి ఆకులు ఔషధులు కలిగిన పువ్వులు, పసుపు, కుంకుమలు నీళ్లలో కలిపి చల్లుకొనే వేడుక చేసుకునేవారు. ఈ నీరు శరీరాన్ని చల్లబరుస్తాయి. ఆరోగ్యం చేకూరుతుంది. కానీ ఇప్పుడు వాడే కృత్రిమ రంగుల కారణంగా ఈ పండుగ ప్రమాదంగా మారింది. ఈ రంగుల వల్ల ఎలర్జీలు, కళ్లు దెబ్బతినడం వంటి కారణాలతో సేంద్రీయ రంగులనే వాడమని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.