చిలకలూరిపేటలో అట్టహాసంగా HMTV, ఆరా ఫౌండేషన్ కార్తీకదీపోత్సవం
చిలకలూరిపేట పట్టణంలో ఆరా ఫౌండేషన్ సమర్పణలో హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో జరిగిన కార్తీక దీపోత్సవం అట్టహాసంగా సాగింది. మహాదేవునికి ప్రీతిపాత్రమైన కార్తీకమాసం చివరి సోమవారం వేడుక అంబరాన్ని తాకింది. స్వామీజీల అనుగ్రహభాషణలు, కళాకారులు సంస్కృతిక కార్యక్రమాల నడుమ కార్తీక దీపోత్సవ సంరంభం నయనానందకరంగా సాగింది. హిందువులకు కార్తీక మాసం ఎంతో విశిష్టమైనది. కార్తీక మాసంలో శివుని ఆరాధిస్తే కోరిన కోర్కెలు తీరతాయని భక్తుల విశ్వాసం. రెండు బిల్వ పత్రాలు సమర్పించి, గుప్పెడు నీళ్లు చల్లి, చిన్న దీపం పెడితే చాలు పరమశివుడు ఉప్పొంగిపోతాడు. అలాంటి స్వామికి కార్తీకమాసంలో నివేదిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. చిలకలూరిపేట పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో పుర ప్రజలతోపాటు, పలు రాజకీయ పార్టీల నేతల హాజరై స్వామివారి సేవలో తరించారు.

కార్తీకదీపోత్సవానికి ప్రారంభానికి ముందు పట్టణంలోని శ్రీ గంగ బాల త్రిపుర సుందరి సమేత నాగమల్లేశ్వర స్వామి వారి ఆలయం నుంచి శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. సుమారు గంటన్నరపాటు వేడుక కన్నులపండువగా జరిగింది. కేరళ కళాకారుల ప్రదర్శనలతో యాత్ర ముందుకు సాగింది. ఈ కార్యక్రమంలో పట్టణంలోని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహాదేవుని దివ్య నామస్మరణతో 3 కిలో మీటర్ల మేర చిలకలూరిపేట పుర వీధుల్లో స్వామి వారి ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది. ఓం నమఃశివాయ, హరహర మహాదేవ అంటూ భక్తులు తన్మయత్వం పొందారు.

ఆ తర్వాత బానలింగానికి రుద్రాభిషేకం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు పంచాముృతాలతో స్వామిని అభిషేకించి, బిల్వపత్రాలు సమర్పించారు. ఇక కార్యక్రమంలో ముందుగా పెజావర్ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విశ్వతీర్థ స్వామీజి అనుగ్రహభాషణం చేశారు. డబ్బుతో అన్నీ కొనగలమని అందరూ భావిస్తున్నారని కానీ.. సుఖసంతోషాలు డబ్బుతో కొనలేమని.. కేవలం దైవారాధనతోనే ఆ భావన కలుగుతుందని చెప్పారు. ఆ తర్వాత బెంగళూరు శ్రీవాసవి పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామీజీ సందేశంలో ఆధ్యాత్మిక పరిమిళాలను వెదజల్లారు. పండుగలు, నోములు, ఆచారాలు, సంప్రదాయాలు ఎప్పటి వరకైతే కొనసాగుతాయో అప్పటి వరకు సనాతన ధర్మం నిలిచే ఉంటుందన్నారు.

కార్తీక మాసం విశిష్టత, సోమవారం పూజించడం వల్ల కలిగే విశిష్టతపై ధారణావధాని నోరి నారాయణమూర్తి అద్భుత ప్రసంగం చేశారు. పరమశివును కటాక్షవీక్షణల భక్తులపై ప్రసరించేలా దివ్య సందేశాన్ని అందించారు. ఆ తర్వాత రుద్రహోమం, శివపార్వతుల కల్యాణం ఒకేసారి నిర్వహించి.. స్వామిని ప్రసన్నమయ్యేలా చేశారు వేద పండితులు. శ్రీశైల దేవస్థానం నుంచి తెప్పించిన స్వామివార్ల ఉత్సవ విగ్రహాలకు వేదమంత్రాల నడుమ కళ్యాణం కమనీయంగా సాగింది. ఈ కార్యక్రమంలో హెచ్ఎంటీవీ సీఈవో దంపతులు సంపత్ రావు, లక్ష్మీరావు, ఆరా ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ మస్తాన్, కరీమా దంపతులు పాల్గొన్నారు. తుని తపోవనం పీఠాధీశ్వరులు పరమపూజ్య పరివ్రాజకాచార్యులు శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. కార్తీకమాసంలో శివపార్వతుల కళ్యాణ వేడుక.. శ్రీశైల దేవస్థానం పండుతులతో నిర్వహించడం గొప్ప విషయమన్నారు. భగంతుడ్ని ఎప్పుడు పూజించినా విశేషమని.. ముఖ్యంగా కార్తీకమాసంలో స్వామిని కొలవడం ద్వారా కోరిన కోర్కెలు ఈడేరతాయన్నారు స్వామీజీ.

ఇక వేడుకలో కళాకారుల నృత్యరూపకాలు ఆకట్టుకున్నాయి. శివపార్వతుల నృత్యరూపకం ఆకట్టుకొంది. సిద్దిపేట కళాకారుల పేరిణి నృత్యం తెలుగు సంప్రదాయాన్ని ఇనుమడింపజేసింది. కేరళ నుంచి వచ్చిన కళాకారులు వేదికపై శివపార్వతుల ఉత్సవశోభను ఇనుమడింపజేశారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన హెచ్ఎంటీవీ సీఈవో దంపతులను… ఆరా ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ మస్తాన్, ఆరా మస్తాన్ దంపతులను లక్ష్మీ, సంపత్ దంపతులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు కన్నా లక్ష్మీనారాయణ, టుబాకో బోర్డు ఛైర్మన్ యడ్లపాటి రఘునాథబాబుతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఓవైపు అట్టహాసంగా కార్యక్రమం చేసేందుకు వారం రోజుల నుంచి ఎన్నో ఏర్పాట్లు. కానీ ఉదయం నుంచి వర్షం కురుస్తోండటంతో కార్యక్రమం ఎలా జరుగుతుందన్న సంశయం వెంటాడింది. ఉదయం నుంచి వర్షం కురవడంతో స్టేడియం అంతా నీళ్లు నిలిచిపోవడంతో నిర్వాహకులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలక్కుండా తగిన ఏర్పాట్లు చేశారు. ఐతే పరమశివును దివ్య ఆశీస్సులతో కార్యక్రమం ప్రారంభమైన దగ్గర్నుంచి పూర్తయ్యే వరకు చిన్న వాన చినుకు కూడా పడకపోవడాన్ని విశేషంగా చెప్పుకోవాలి. కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి పరమశివును ఆశీస్సులు మెండుగా ఉన్నాయని చెప్పుకోవాలి. కార్తీకదీపోత్సవ ఘట్టం ఆరంభం నుంచి వరుణదేవుడు… శివపార్వతుల కల్యాణాన్ని మేఘాల మధ్యే ఉండి వీక్షించడంతో స్వామిసేవలో పాల్గొన్నారు.

