Andhra PradeshBreaking Newshome page sliderHome Page SliderNewsPoliticsviral

తాడిపత్రిలో హై టెన్షన్

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నాయకుడు, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి ముందు చేరి కవ్వింపు చర్యలకు దిగారు. దీంతో పరిస్థితి గందరగోళంగా మారింది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని వారిని అక్కడి నుంచి వెనక్కి పంపారు. శుక్రవారం ఉదయం పెద్దారెడ్డి పోలీసు భద్రత నడుమ తన నివాసానికి చేరుకున్నారు. తన ఇంటి వెనుకభాగంలో ఉన్న ప్రహరీ గోడ కొంత తొలగించి కొత్త గేటు నిర్మాణానికి ప్రయత్నించారు. ఈ చర్య జేసీ ప్రభాకర్రెడ్డికి నచ్చకపోవడంతో మున్సిపల్ అధికారులను ఉసిగొల్పి గేటును తొలగించి తిరిగి గోడ కట్టేలా చేశారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో తన అనుచరులను వెంటనే రావాలని జేసీ పిలుపునిచ్చారు. దీంతో, ఆయన అనుచరులు పెద్ద ఎత్తున కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వారితో కలిసి సమీపంలోని కళాశాల క్రీడా మైదానంలోకి వెళ్లి కేకలు వేస్తూ రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. పరిస్థితి అదుపు తప్పేలోపే ఏఎస్పీ రోహిత్ కుమార్ పోలీసు బలగాలతో అక్కడికి చేరుకుని జేసీ అనుచరులను వెనక్కి పంపించారు. మరోవైపు, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి సమీపంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలకు శాంతంగా ఉండాలని, సమన్వయం పాటించాలని కేతిరెడ్డి పెద్దారెడ్డి సూచించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో తాడిపత్రి రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది.