ములుగు జిల్లాలో హై టెన్షన్..
తెలంగాణలోని ములుగు జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. అక్కడ కర్రెగుట్టలో భారీ సంఖ్యలో మావోయిస్టులు తలదాచుకున్నారనే సమాచారం రావడంతో రెండువేల మంది భద్రతా దళాలతో తెలంగాణ, ఛత్తీస్ ఘడ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. కర్రెగుట్టకు అవతలివైపు ఛత్తీస్ ఘడ్ బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ పరిధిలోకి, ఇవతలి వైపు ములుగు జిల్లా వాజేడు మండలం పరిధిలోకి రావడంతో రెండు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. సీఆర్‌పీఎఫ్ బలగాల ప్రతికాల్పులతో ఆ ప్రాంతం దద్ధరిల్లుతోంది. ప్రధానంగా హిడ్మా దళం కర్రెగుట్టలో సంచరిస్తున్నట్లు సమాచారం అందింది. కర్రెగుట్టకు సమీపంలో గల పెనుగోలు, కొంగాల, బొల్లారం, అరుణాచల పురం, వెంకటాపురం మండలంలో గల గ్రామాలు, ముత్తారం, మల్లాపురం, సీతారాంపురం వంటి గ్రామాలలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ ప్రాంత ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు.

