గాంధీ భవన్‌లో హైటెన్షన్… దిగ్విజయ్ ఉండగానే గల్లాలు పట్టుకున్న నేతలు
గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గాంధీభవన్ ఎదుట కాంగ్రెస్ నేతల ఆందోళనకు దిగారు. తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్‌కు వచ్చారు. పార్టీలో రేగిన చిచ్చును చల్లార్చేందుకుగాను రెండు రోజులు ఆయా నేతలతో చర్చలు జరపాలని దిగ్విజయ్ అనుకున్నారు. గాంధీభవన్‌లో దిగ్విజయ్ కాంగ్రెస్ సీనియర్ లీడర్లతో మాట్లాడుతున్న సమయంలోనే… బయట కాంగ్రెస్ నేతల మధ్య గొడవ జరిగింది. ఓయూ నుంచి వచ్చిన విద్యార్థి నేతలు.. మాజీ ఎమ్మెల్యే అనిల్ వర్గంతో వాగ్వాదానికి దిగారు. పార్టీ సీనియర్లు ఉత్తమ్ కుమార్, హనుమంతరావు, భట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ వంటి సీనియర్ నేతలను కోవర్టులు అని అనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సీనియర్లకు అన్యాయం చేస్తున్నారన్నారు. ఐతే అక్కడే ఉన్న అనిల్.. ఎవరికి అన్యాయం జరిగిందని ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే మాటా మాటా పెరిగి.. ఇరువర్గాలు పరస్పరం తోసుకున్నారు. గల్లాలు పట్టుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే సీనియర్ నేత మల్లు రవి కలగజేసుకొని… ఇరువర్గాలకు సర్ది చెప్పారు. అనంతరం మల్లు రవి మాట్లాడుతూ.. ఏదైనా సమస్య ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, ఇలాంటి గొడవలు, కొట్టుకోవడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అందరూ సమన్వయంతో పనిచేయాలని శిరస్సు వంచి కోరుతున్నానన్నారు. నేతల మధ్య బేధాభిప్రాయాలను దిగ్విజయ్ సింగ్ పరిష్కరిస్తారని మల్లు రవి తెలిపారు.