బండి సంజయ్‌ను కాన్వాయ్‌లు మారుస్తూ, తిప్పుతున్న పోలీసులు
బండి సంజయ్ అరెస్టు విషయంలో పోలీసుల వ్యవహారం అంతా హైడ్రామా అంటున్నారు బీజేపీ నాయకులు. మొదటి నుండి సీక్రెట్‌గానే బండి సంజయ్ విషయంలో వ్యవహరిస్తున్నారు పోలీసులు. అర్థరాత్రి ఆయనను హఠాత్తుగా అరెస్టు చేయడం, అనంతరం కాన్వాయిలు మారుస్తూ, సంజయ్‌ను తిప్పుతున్నారు పోలీసులు. బీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున కోర్టు పరిసరాలకు చేరుకున్నారు. బీజేపీ నాయకులను హౌస్ అరెస్టు చేయడం కూడా సంచలనంగా మారింది. సంజయ్ మీద ఏ కేసు నమోదు చేశారో, అతడు ఏవిధంగా బాధ్యుడో తెలియజేయమని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ కార్యకర్తలు.

వాట్సాప్‌లో పేపర్‌ను లీక్ చేసిన వ్యక్తిపై కేసు పెట్టవచ్చు కానీ, రాజకీయ నాయకులకు అది వాట్సాప్‌లో మెసేజ్ వచ్చినంత మాత్రాన వారిపై కేసులు పెట్టడం కుట్ర పూరితం అని న్యాయవాదులు అంటున్నారు. ఈ విషయంలో అరెస్టు చేయవలసిన కేసు కాదని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికి కూడా ఏ కేసుపై అరెస్టు చేశారో పోలీసులు చెప్పడం లేదు. అర్థరాత్రి నుండి ఈయనను ఆరు కమిషరేట్లు తిప్పారని తెలిపారు. ఎఫ్‌ఐఆర్ కాపీని కూడా ఇవ్వడం లేదని, ఇస్తే బెయిల్ తీసుకుంటారని భావిస్తున్నారు. ఓ పక్క హరీష్‌రావు, ఇతర తెలంగాణా మంత్రులు విషయం పూర్తిగా తేలకుండా, విచారణలు జరగకుండా ఆరోపణలు చేస్తున్నారు. కాసేపట్లో సంజయ్‌ను హనుమకొండ జిల్లా కోర్టుకు తీసుకువస్తున్నారు పోలీసులు.