షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వరంగల్ జిల్లాలో పాదయాత్రకు పోలీసులు అనుమతివ్వకపోవడంతో… అనుమతి కోరుతూ వైఎస్సార్టీపీ సభ్యుడు హైకోర్టును ఆశ్రయించాడు. ప్రశాంతంగా జరుగుతున్న పాదయాత్రకు టీఆర్ఎస్ కార్యకర్తలు ఆటంకం కలిగిస్తున్నారని.. కోర్టుకు వైఎస్సార్టీపీ వివరించింది. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. పాదయాత్రలో సీఎం కేసీఆర్‌పైన, రాజకీయ, మతపరమైన అంశాల్లో రెచ్చగొట్టేలా మాట్లాడొద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. తక్షణమే షర్మిల పాదయాత్రకు అనుమతివ్వాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఇవాళ ఉదయం తన కారును క్రేన్‌తో లాక్కెళ్లడంపై షర్మిల స్పందించారు. కేసీఆర్ పిరికిపంద చర్యలకు వైయస్ఆర్ బిడ్డ షర్మిల బెదరదన్నారు. ప్రజాస్వామ్యాన్ని పాతరేసి, అధికారాన్ని అడ్డం పెట్టుకుని, పోలీసులను పనోళ్లలా వాడుకొని, టీఆర్ఎస్ గూండాలను ఉసిగొల్పి దాడులకు పాల్పడితే.. ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. ప్రగతిభవన్ లో దాక్కున్నా.. ఫామ్ హౌజ్ లో దాక్కున్నా.. పతనం ఖాయమన్నారు షర్మిల.

