ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితులకు బెయిల్ మంజూరు
ఓవైపు రాజకీయ యుద్ధం కొనసాగుతుంటే.. మరోవైపు కేసులపై విచారణలు వేగంగా జరుగుతున్నాయ్. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితులుగా ఉన్న ముగ్గురికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్‌లకు హైకోర్టు కండిషనల్ బెయిల్ ఇచ్చింది. నిందితులు ప్రతి సోమవారం పోలీసుల ముందు హాజరుకావాలని కోర్టు పేర్కొంది. ఓవైపు ఎమ్మెల్యేల ఎర కేసుతోపాటు, రామచంద్రభారతిపై బంజారాహిల్స్ పీఎస్‌లో మరో రెండు కేసులు సైతం నమోదయ్యాయి. నకిలీ ఆధార్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నారన్న ఆరోపణలపై కేసు నమోదు చేశారు. ఓవైపు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన ఈ రెండు కేసుల్లో ఆయనను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఇక నందకుమార్‌పైనా 5 కేసులు నమోదై ఉన్నాయి. ఫిల్మ్ నగర్ డెక్కన్ కిచెన్ లీజు విషయంలో ఆయనపై కేసులున్నాయి. ఈ కేసుకు సంబంధించి నంద కుమార్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించారు.


