ఐఏఎస్ శ్రీలక్ష్మికి హైకోర్టు క్లీన్‌చిట్
ఓబుళాపురం మైనింగ్ అక్రమాల కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పని చేస్తున్న శ్రీలక్ష్మి దాఖలు చేసిన క్యాష్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఆమెపై సీబీఐ పెట్టిన అవినీతి కేసు నుంచి విముక్తి కల్పించింది. 2007-09 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గనుల శాఖ కార్యదర్శిగా ఉండగా రూ.80 లక్షల లంచం తీసుకొని గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి అనుమతి ఇచ్చారన్నది శ్రీలక్ష్మిపై ప్రధాన అభియోగం. ఈ విషయాన్ని సీబీఐ 2012లో దాఖలు చేసిన చార్జిషీట్‌లోనూ ప్రస్తావించింది. దీంతో ఏడాది పాటు జైలు జీవితం కూడా గడిపిన శ్రీలక్ష్మి తనపై కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో పోరాడుతున్నారు.

ఓబుళాపురం మైనింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి యర్రా శ్రీలక్ష్మికి ఊరట లభించింది. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో… శ్రీలక్ష్మి గనుల శాఖ కార్యదర్శిగా పనిచేశారు. గనుల కేటాయింపులో ఓఎంసీకి నిబంధనల విరుద్ధంగా కేటాయించారంటూ సీబీఐ ఆరోపించింది. గాలి జనార్దన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించారంది. అయితే కేసు విచారించిన హైకోర్టు.. శ్రీలక్ష్మిపై అభియోగాలకు ఆధారాల్లేవంది. ప్రస్తుతం శ్రీలక్ష్మి ఆంధ్రప్రదేశ్ లో కీలక అధికారిగా పనిచేస్తున్నారు. ఏపీలో వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఆమెకు ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చింది. డిసెంబరు 2020లో ఆమె తెలంగాణ కేడర్ నుండి ఆంధ్ర ప్రదేశ్ కేడర్‌కు మారారు. ఐతే తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ 7, 2016న ఆమెకు పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చింది.

