భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులలో హైఅలర్ట్
బంగ్లాదేశ్ అల్లర్లతో అట్టుడికిపోతోంది. దీనతో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులలో హైఅలర్ట్ చోటు చేసుకుంది. ఆందోళనకారులు ప్రధాని షేక్ హసీనా నివాసాన్ని చుట్టుముట్టి, బీభత్సం సృష్టించారు. అవామీ లీగ్ ఆఫీసుకు నిప్పు పెట్టారు. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి, భారత్‌లో ఉన్నారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో భారత్ సైన్యం కూడా అప్రమత్తం అయ్యింది. ఇప్పటికే బీఎస్‌ఎఫ్ చీఫ్ కోల్‌కత్తాకు చేరుకున్నారు. బంగ్లాదేశ్‌తో భారత్‌కు ఉన్న సత్సంబంధాలను బట్టి భారత్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడవచ్చని సమాచారం. అన్ని పార్టీలతో చర్చల అనంతరం బంగ్లాదేశ్‌లో ఆర్మీపాలన కొనసాగుతుందని అక్కడి ఆర్మీ చీఫ్ వెల్లడించారు. బంగ్లాదేశ్‌లో కర్ఫ్యూ కొనసాగుతోంది. హసీనాను దేశం విడిచి వెళ్లాలని హెచ్చరించారు ఆర్మీ చీఫ్. దేశంలో రాత్రిలోపు పరిస్థితులను అదుపులోకి తెస్తామని ప్రకటించారు. ఉద్యోగాలలో రిజర్వేషన్ల కోసం మొదలైన ఈ అల్లర్ల కారణంగా దేశ శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లింది. అక్కడి భారత పౌరులను సురక్షితంగా తిరిగి తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని భారత ప్రభుత్వం హామీ ఇచ్చింది. కొత్త ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉంటామని తెలియజేసింది.

బంగ్లాదేశ్ స్వాతంత్య్రం కోసం పోరాడిన అమర వీరుల కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 30 శాతం రిజర్వేషన్లు కల్పించాలని షేక్ హసీనా తీసుకున్న నిర్ణయమే ఆమె పాలిట శాపమయ్యింది. ఈ నిర్ణయం పక్షపాతంతో కూడినదని, దీనివల్ల అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులకే ప్రయోజనం చేకూరుతుందంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని, హసీనా రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. చివరికి సుప్రీంకోర్టు కలుగజేసుకుని 30 శాతం రిజర్వేషన్లను 5 శాతానికి కుదించింది. అయినా ఆందోళనలు తగ్గలేదు. ఇప్పటి వరకూ ఈ ఉద్రిక్తతల కారణంగా 300మంది చనిపోయారు. ఈ విషయంపై అధికార, విపక్షాలు ఆరోపణలు చేసుకున్నాయి. చివరికి ప్రధాని రాజీనామా చేసి, దేశం విడిచి వెళ్లవలసి వచ్చింది.