పంజాబ్‌లో హై అలర్ట్.. అమృతపాల్ కోసం రాష్ట్రాన్ని జల్లెడ పడుతున్న పోలీసులు
పంజాబ్‌లో పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు అమృత్ పాల్ సింగ్. సిక్కుల సమస్యలకు ప్రత్యేక దేశమే పరిష్కారమని సిక్కులకు ఉపదేశాలు ఇస్తూ, వారిని రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నాడు. రాష్ట్రంలో విద్వేషాలు రగిలిస్తున్న అమృతపాల్ సింగ్‌పై కేంద్రం అలెర్టయ్యింది. అతనిని అరెస్టు చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. శనివారం పోలీసులకు చిక్కినట్లే చిక్కి అదృశ్యమయ్యాడు. ఇప్పటి వరకూ 78 మంది అమృత్ పాల్ సింగ్ అనుచరులను అరెస్టు చేసారు పంజాబ్ పోలీసులు. రాష్ట్రమంతా జల్లెడ పడుతున్నారు. దేశం వదిలి వెళ్లకుండా అన్ని రవాణా వ్యవస్థలను అప్రమత్తం చేసింది హోం శాఖ. రాష్ట్రవ్యాప్తంగా అతని మద్దతు దారుల ఆందోళనల నేపథ్యంలో ఇంటర్నెట్, సమాచార వ్యవస్థలపై ఆంక్షలు విధించింది ప్రభుత్వం. ప్రజల రక్షణ కోసం మంగళవారం మధ్యాహ్నం వరకూ మొబైల్ ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపి వేస్తున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే పలు కేసులలో ఇతనికి సంబంధం ఉంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాడు. సిక్కుల ఐక్యత, హక్కుల గురించి సోషల్ మీడియాలో వ్యాఖ్యలు రాస్తూ పాపులర్ అయ్యాడు. వారిస్ పంజాబ్ దే నాయకుడు దీప్ సిద్దూ మరణం తర్వాత తనను తాను ‘వారిస్ దే పంజాబ్’ కు నాయకుడిగా ప్రకటించుకున్నాడు.