NationalNews

వివాదంలో హీరో విశాల్..షాకిచ్చిన హైకోర్టు

దక్షిణాది రాష్ట్రాలలో తన నటనతో ప్రజలను ఆకట్టుకున్న ప్రముఖ హీరో విశాల్. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ.. ప్రజలను ఆకర్షిస్తూంటారు. కొంతకాలంగా ఈయన హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ.. విజయం సాధించారు. హీరో విశాల్ నిర్మాతగా తన ప్రస్థానం మొదలు పెట్టినప్పటినుంచి తరుచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో ఆయన తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు.  దీంతో మద్రాస్ హైకోర్టు తన ఆస్తుల వివరాలు సమర్పించాలని విశాల్‌కి హుకుం జారీ చేసింది. దీనికి ప్రధాన కారణం ఆయన నిర్మాతగా వ్యవహరించడమే అని తెలుస్తోంది. తన సినిమాలను తానే స్వయంగా నిర్మించిన విశాల్ నిర్మాతగా కూడా సక్సెస్‌ఫుల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఫిల్మ్ ఫ్యాక్టరీ ద్వారా కూడా చాలా సినిమాలు నిర్మించారు. ఈ క్రమంలో ఆయన తాజాగా ఓ ఆర్థిక వివాదంలో ఇరుక్కున్నారు. ప్రస్తుతం హీరోగా,నిర్మాతగా కొనసాగుతున్న విశాల్ గోపురం సంస్థ నుంచి రూ. 21.29 కోట్లు రుణం తీసుకున్నారు. ఈ రుణాన్ని గోపురం సంస్థకు లైకా ప్రొడక్షన్స్ చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో ఈ రుణాన్ని లైకా ప్రొడక్షన్స్ తిరిగి చెల్లించే వరకు విశాల్ సినిమాల హక్కులను గోపురం సంస్థకు రాసిచ్చే విధంగా ఆ సంస్థ ఒప్పందం రాయించుకుంది.

అయితే విశాల్ గోపురం సంస్థకు అప్పు చెల్లించకపోవడంతో లైకా ప్రొడక్షన్స్ ఆయనపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌లో విశాల్ తమ దగ్గర అప్పుగా తీసుకున్న రూ.21.29 కోట్లు చెల్లించకుండా..రూల్స్ బ్రేక్ చేశారని లైకా ప్రొడక్షన్స్ ఆరోపించింది. అంతేకాకుండా ఆయన తన సినిమాను వేరే సంస్థలకు  అమ్ముకుంటున్నారంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు విశాల్ సినిమా తమిళ శాటిలైట్, ఇతర భాషల శాటిలైట్ ,ఓటీటీ హక్కుల విక్రయంపై నిషేదం విధించాలని కోరింది. గతంలో ఈ పిటిషన్ ‌పై విచారణ జరిపిన కోర్టు తీర్పు వెలువరించింది.

దీనిలో భాగంగానే హీరో విశాల్ రూ.15 కోట్లు ఏదైనా జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేయాలని  కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ విశాల్ ఇప్పటి వరకు వాటిని డిపాజిట్ చెయ్యలేదు. దీంతో కోర్టు శుక్రవారం మరోసారి ఈ కేసుపై విచారణ జరిపించింది. ఈ విచారణకు హీరో విశాల్ ప్రత్యక్షంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విశాల్‌ను విచారించిన కోర్టు న్యాయస్థానం ఆదేశించిన విధంగా డబ్బులు ఎందుకు డిపాజిట్ చేయలేదని ప్రశ్నించింది. దీనికి విశాల్ సమాధానమిస్తూ..తాను ఒకే రోజు రూ.18 కోట్లు నష్టపోయానని, దానికే ఇంకా వడ్డీ చెల్లిస్తున్నానని తెలిపారు. దీంతో కోర్టు మీరు ఇలా సమాధానమిస్తే ఈ కేసు ముగుస్తుందని భావిస్తున్నారా.. అని హీరో విశాల్‌ను  ప్రశ్నించింది. కాగా హీరో విశాల్ తన ఆస్తుల వివరాలను న్యాయస్థానానికి సమర్పించాలని సూచించింది. కోర్టు తరువాత విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేసింది. అయితే తదుపరి విచారణకు హీరో విశాల్ ఖచ్చితంగా హాజరు కావాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది.