ఉక్రెయిన్‌లో ఘోర హెలికాఫ్టర్ ప్రమాదం – మంత్రి సహా పలువురు మృతి
ఉక్రెయిన్‌లో ఊహించని ఘోర దుర్ఘటన జరిగింది. అసలే దాదాపు సంవత్సర కాలంగా రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ పరిస్థితి ‘మూలిగే నక్కపై తాటిపండు పడినట్లయ్యింది’. హెలికాఫ్టర్ కూలి పోవడంతో ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి డెనిస్ మోనాస్ టిస్కీతో సహా 18 మంది మృత్యువాత పడ్డారు. వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ దుర్ఘటన రాజధాని నగరం కీవ్‌కు సమీపంలోని బ్రోవరీ అనే ప్రాంతంలో జరిగింది. ఆ ప్రదేశంలో కిండర్ గార్డెన్ పాఠశాల, నివాస భవనాలు ఉండడంతో ప్రాణనష్టం అధికమైంది. కీవ్ రీజియన్ గవర్నర్ సమాచారం ప్రకారం 18 మంది మృతి చెందినట్లు, 29 మందికి గాయాలైనట్లు తెలిసింది. గాయపడిన వారిలో కూడా 15 మంది పిల్లలు ఉన్నరని పేర్కొన్నారు. ఉక్రెయిన్ పోలీస్ సర్వీస్ చీఫ్ ప్రకటనలో అంతర్గత వ్యవహాలరాల మంత్రి డెనిస్, ఆయన సహాయమంత్రి యెవ్‌జెనియ్ యెనిన్ కూడా మరణించినట్లు తెలిపారు. ఆ ఘటనకు గల కారణాలు ఇంతవరకూ తెలియరాలేదు. కాలం చెల్లిన వైమానిక మౌలిక వసతులు వాడడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు.

