హైదరాబాద్ లో దంచి కొట్టిన వాన
హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. వడగళ్లతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. ఓ వైపు ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కుండపోత వర్షం.. మరోవైపు భారీ ఈదురు గాలులు నగర ప్రజలను భయపెట్టాయి. ముఖ్యంగా పంజాగుట్ట, అమీర్ పేట, ఖైరతాబాద్, లక్షీకపూల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, బేగంపేట, నాంపల్లి, మలక్ పేట, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హస్తినాపురం తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. వర్షానికి తోడు వడగళ్లు కురవటంతో రోడ్లపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవటంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కి.మీ మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పలు కాలనీల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దాదాపు అరగంట పాటు ఆగకుండా కురిసిన వర్షంతో నగర ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు.