తెలుగు రాష్ట్రాలలో మళ్ళీ వానలు
తెలుగు రాష్ట్రాలను వర్షాలు ఇప్పట్లో కనికరించేటట్లు కనిపించడం లేదు. మొన్నటి వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతోనే ప్రజలు ఇంకా కోలుకోలేదు. ఇప్పుడు కురిసిన వర్షాలకే అన్నీ ప్రాజెక్టులలోకి ఉధృతంగా నీరు చేరింది. వరద పోటు పెరుగుతోంది. అంతేకాకుండా వరద ప్రభావిత ప్రాంతాలలోని ప్రజలు ఇంకా తేరుకోనే లేదు. ఈ నేపథ్యంలో మరో మూడు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావంతో భారీ వర్షాలు కురనున్నాయి. వీటి ఫలితంగా ఏపీ,తెలంగాణ,యానాంలలో ఈ నెల 31 వరకు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా,యానాంలో అల్పపీడన ద్రోణి ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షం పడనుంది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నట్లు సమాచారం. మరోవైపు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ తేలిక పాటి జల్లులు కురుస్తాయని వాతావరణశాఖ స్పష్టం చేసింది.