NationalNews

బెంగళూరులో భారీ వర్షాలు.. ఐటీ హబ్‌కు రూ.225 కోట్ల నష్టం

కర్ణాటక రాజధాని బెంగళూరులో కుండపోత వర్షం కురిసింది. ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం కురిసిన భారీ వర్షాలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వారం రోజుల్లో బెంగళూరులో రెండోసారి భారీ వర్షాలు కురవడంతో నగర ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పలుచోట్ల గంటల పాటు ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో ఆఫీసులకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అపార్ట్‌మెంట్లలో పార్కింగ్‌ స్థలాల్లోని వాహనాలు నీట మునిగాయి. కొన్ని చోట్ల బైక్‌లు నీటిలో కొట్టుకుపోయాయి. అత్యవసరమైతేనే బయటకు రావాలంటూ ప్రజలను పోలీసులు అప్రమత్తం చేశారు. హిందుస్థాన్‌ ఏరోనాటికల్‌ లిమిటెడ్‌ కంపెనీ పరిసరాల్లో వరద నీరు భారీగా చేరింది. బెంగళూరు ఐటీ కారిడార్‌ కూడా వరద నీటిలో మునిగింది. ఐటీ కంపెనీలకు రూ.225 కోట్ల నష్టం వాటిల్లింది. దీంతో అమేజాన్‌, విప్రో, ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం కేటాయించింది. ఈ నెల 9వ తేదీ వరకు నగరంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.