భారీ వర్షాలతో శ్రీశైలంకు జలకళ
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా నీరువచ్చి జలకళతో కళకళలాడుతోంది. పశ్చిమ కనుమలలో కురుస్తున్న భారీ వర్షాలతో అప్పర్ కృష్ణా ప్రాజెక్ట్ ఆల్మట్టికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం లక్షా పదిహేను వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోందని అంచనా. 123 టీఎంసీల గరిష్ట సామర్థ్యం ఉన్న ఈ జలాశయం ఇప్పటికే సగం నిండిపోయింది. ఈ వరద ఇలాగే కొనసాగితే మరో వారం రోజుల్లో ఆల్మట్టి నీటి నిల్వ పూర్తి స్థాయికి చేరుకుంటుందని అంచనాలు వేస్తున్నారు అధికారులు. ఆల్మట్టికి దిగువన గల నారాయణ పుర డ్యామ్‌కు 14 వేల క్యూసెక్కులు, దాని దిగువన గల తెలంగాణాలోని జూరాల ప్రియదర్శని ప్రాజెక్టుకు 26 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. జూరాలలో జలవిద్యుదుత్పత్తి ప్రారంభించి వచ్చిన నీటిని వచ్చినట్లే శ్రీశైలం రిజర్వాయర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం కృష్ణానది, తుంగభద్రకు కూడా 47 వేల క్యూసెక్కుల వరద వస్తోందని అధికారులు తెలియజేశారు. నీటి సామర్థ్యం మించి పోవడంతో శ్రీశైలం గేట్లు తెరిచారు. దీనితో శ్రీశైల దర్శనానికి వెళ్లే భక్తులకు శ్రీశైలం డ్యామ్ కన్నుల విందు చేస్తోంది. మధ్య మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లో కృష్ణానది జన్మస్థానం మహా బలేశ్వర్‌లో ఆదివారం 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఘాట్స్ దిగువన కష్ణా పరివాహక ప్రాంతమైన సతారా జిల్లాలో ఈ నెల 27 వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. కృష్ణా ఉపనది భీమా క్యాచ్ మెంట్ ఏరియాలో కూడా భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆగస్టు చివరి వారానికి శ్రీశైలం పూర్తిగా నిండుతుందని అంచనాలు వేస్తున్నారు.

