నేపాల్‌ను ముంచెత్తిన భారీ వరదలు..పలువురు మృతి
నేపాల్ దేశాన్ని భారీ వరదలు ముంచెత్తాయి. కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా ఆ హిమాలయ దేశంలో ఇప్పటి వరకూ 39 మంది మృతి చెందినట్లు సమాచారం. మరో 11 మంది ఆచూకీ లేకుండా పోయారు. వరదల వల్ల ఖాఠ్‌మండూ, భక్తపూర్, కవ్రేపాలన్ చౌక్, లలిత్ పూర్ వంటి నగరాలలో మరణాలు సంభవించాయి. దాదాపు 226 ఇళ్లు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. వరదల కారణంగా కొండచరియలు విరిగి పడుతున్నాయి. మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉన్నందువల్ల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నేపాల్‌లో దాదపు మూడువేల మంది భద్రతా సిబ్బంది సహాయక చర్యలలో పాల్గొంటున్నారని అధికారులు వెల్లడించారు. 23 రాఫ్టింగా బోట్ల సహాయంతో ఇప్పటి వరకూ 760 మందిని రక్షించినట్లు తెలిపారు. అయితే ఈ వరదలు బీహార్‌లో ప్రవేశించే ప్రమాదముంది. నేపాల్ నుండి నదులు బీహార్‌లోకి ప్రవహించడం వల్ల వరదనీరు రాష్ట్రానికి వచ్చే ప్రమాదం ఉందని, ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. కోసి, గండక్ నదులు పొంగిపొరలడంతో బీహార్ అప్రమత్తమయ్యింది.