జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల్లోకీ భారీగా వరద నీరు
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రధాన జలాశయాల్లో వరద ప్రవాహం ప్రారంభమైంది. కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టులో రెండు గేట్లు ఎత్తి భారీగా నీటిని విడుదల చేయడంతో, జూరాల ప్రాజెక్టులోకి 50 వేల క్యూసెక్కుల వరద ప్రవేశించింది. ఈ నేపథ్యంలో జూరాలలో నీటి నిల్వ 8.184 టీఎంసీలకు చేరగా, జెన్‌కో జలవిద్యుత్ కేంద్రం ద్వారా 2.702 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. అదేవిధంగా 25,835 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులోనూ వరద నీరు ప్రవేశిస్తూ, రోజువారీగా 35,796 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గానూ ప్రస్తుతం 842.40 అడుగుల్లో 65.4574 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కూడా 9 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, అందులో కొంత భాగాన్ని జలవిద్యుత్ ఉత్పత్తి ద్వారా, మిగతా భాగాన్ని కాలువల ద్వారా విడుదల చేస్తున్నారు. అయితే గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో మాత్రం వరద ప్రవాహం తక్కువగానే కొనసాగుతోంది.