Andhra PradeshNews

గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీలో భారీ అగ్ని ప్రమాదం

ఎప్పుడైనా , ఎక్కడైనా సిలిండర్ పేలితే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అలాంటిది ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100 కి పైగా సిలిండర్లు పేలాయి. దీంతో వాటిని పెట్టి ఉంచిన లారీ పూర్తిగా కాలిపోయింది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర భయాందోళనకు గురి చేసింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం దద్దవాడ గ్రామం వద్ద అనంతపురం -గుంటూరు జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. నిండుగా ఉన్న గ్యాస్ సిలిండర్లతో వెళుతున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లారీలో మొత్తం 300 వందలకు పైగా సిలిండర్లు ఉన్నాయి. వాటిలో 100కి పైగా సిలిండర్లు పేలాయి. దీంతో లారీ పూర్తిగా దగ్ధమైపోయింది.

 కర్నూలు నుంచి నెల్లూరు జిల్లా ఉలవపాడుకు వెళుతున్న భారత్ గ్యాస్ సిలిండర్లతో నిండి ఉన్న లారీ క్యాబిన్‌లో మంటలు ప్రారంభమయ్యాయి. దీనిని గమనించిన డ్రైవర్ మోహన్ రాజు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆయన లారీని అక్కడే ఆపి కిందకి దిగి ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. లారీలో ఉన్నవి అన్నీ కూడా నిండు సిలిండర్లు కావడంతో జాతీయ రహదారిపై రెండువైపులా అర కి.మీ.మేర పోలీసులు వాహనాలను నిలిపివేశారు.

అనంతరం సిలిండర్లు క్రమంగా పేలడం ప్రారంభమయ్యాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ వైపుగా ఎవ్వరిని వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.  అంతే కాకుండా పోలీసులు ఈ ఘటన జరిగిన ప్రదేశానికి 300 మీటర్ల దూరంలో ఉన్న సుమారు 30 ఇళ్లను ఖాళీ చేయించారు. అప్పటికే అగ్నిమాపక వాహనం ఘటనాస్థలానికి చేరుకున్నప్పటికీ.. సిలిండర్లు వరుసగా పేలుతుండడంతో 200 మీటర్ల నుంచే వారు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. లారీలో గ్యాస్ సిలిండర్లు భారీగా పేలడంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులు అటువైపు రాకపోకలను కూడా నిలిపి వేయడంతో పెను ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు.