మార్చి 22న ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అక్రమాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ నాయకురాలు కె కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను మార్చి 22న సుప్రీంకోర్టు విచారించనుంది. కేసును న్యాయమూర్తులు ఎంఎం సుందరేష్, బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని విచారించనుంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అక్రమాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కె కవిత తన న్యాయవాది పి మోహిత్ రావు ద్వారా సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మార్చి 15న ED బృందం అరెస్టు చేయడంతో కవితను మార్చి 23 వరకు ఏడు రోజుల పాటు ED కస్టోడియల్ ఇంటరాగేషన్‌లో ఉంది. తన అరెస్టు, రిమాండ్ ఆర్డర్ ఆర్టికల్ 141కి విరుద్ధంగా ఉందని కవిత పేర్కొన్నారు. కవిత తన పిటిషన్‌లో PMLA చట్టంలోని సెక్షన్ 19 (1)ని కూడా సవాలు చేశారు. తన అరెస్ట్ ప్రాధమిక హక్కుల ఉల్లంఘన అని ఆమె తెలిపారు. ఎలాంటి ప్రమేయం లేకున్నా కేసులో ఇరికిస్తున్నారని చెప్పారు.

మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లను సవాలు చేస్తూ బీఆర్‌ఎస్ నాయకురాలు కె.కవిత మంగళవారం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అగ్రనేతలైన అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలతో కలిసి కుట్ర పన్నారని, 100 కోట్ల చెల్లింపులో పాలుపంచుకున్నారని అంతకుముందు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారం పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో తెలంగాణ శాసనమండలి ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన మూడు రోజుల తర్వాత ఈడీ ఈ ప్రకటన చేసింది. అదే రోజు హైదరాబాద్‌లోని కవిత నివాసంలో సోదాలు జరుగుతున్నప్పుడు, కవిత బంధువులు, సహచరులు తమను అడ్డుకున్నారని ED అధికారులు తెలిపారు. “ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో బెనిఫిట్ పొందేలా చట్టాన్ని రూపొందించడంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలతో కలిసి కుట్ర పన్నారని ED దర్యాప్తులో తేలిందని పేర్కొంది. ఇందుకుగాను ఆప్‌కు వంద కోట్లు ముట్టాయని.. ఈ తతంగంలో కవిత ప్రమేయముందని ఈడీ అభిప్రాయపడింది.

మరోవైపు ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఇవాళ నాలుగో రోజు విచారించారు. ఢిల్లీ లోని ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన్ భవన్‌లో కవితను విచారించారు. లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కవిత పాత్ర.. రూ. 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్ర, సిసోడియా, కేజ్రీవాల్‌తో ఒప్పందాలు సహా నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలపై అధికారులు కవితను ప్రశ్నించారు. రోజులో 6-7 గంటల పాటు సీసీటీవీ పర్యవేక్షణలో కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. లిఖిత పూర్వకంగా, మౌఖికంగా కవిత నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కాగా, ఈడీ కార్యాలయం లోని క్యాంటీన్ లో కవిత భోజనం చేస్తున్నారు. ఈడీ కస్టడీలో ఉన్న కవిత.. తన తల్లి శోభమ్మ, కుమారులు ఆదిత్య, ఆర్య, సోదరీమణులు అఖిల సౌమ్య, వినుత, సోదరుడు ప్రశాంత్‌ను కలుసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ లోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కవితకు ఆమె తల్లి, పిల్లలను కలిసేందుకు రూస్ అవెన్యూ కోర్టు మంగళవారం అనుమతినిచ్చింది. ఈ మేరకు ఆమె తరఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు కవిత తల్లి శోభ, కుమారులు ఆదిత్య, ఆర్య, సమీప బంధువులు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఆమెను సందర్శించేందుకు అనుమతించారు. అయితే రోజు రోజుకూ కవిత విచారణ సమయాన్ని ఈడీ పెంచుతున్నట్టు తెలుస్తోంది. ఆధారాలు లభించేలా కవిత విచారణ ఉన్నట్టు ఈడీ చెబుతోంది.