కేసీఆర్ కాళ్లు మొక్కిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్..!
తెలంగాణలో అధికారుల స్వామి భక్తి మరీ ఎక్కువైంది. గతంలో కలెక్టర్లు, ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్లు సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కి విమర్శల పాలయ్యారు. స్వామి భక్తికి నజరానాగా కొందరు అధికారులు ప్రమోషన్ పొందారు. మరికొందరు పదవీ కాలాన్ని పొడిగించుకున్నారు. ఇంకొందరు ప్రజా ప్రతినిధులుగా మారారు. తాజాగా తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు స్వామి భక్తి విమర్శల పాలైంది. డైరెక్టర్‌గా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న శ్రీనివాస్ సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కడం సర్వత్రా చర్చనీయాంశమైంది. కేసీఆర్ కాళ్లు ఒకసారి కాదు.. రెండుసార్లు మొక్కడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

బానిసత్వానికి కేరాఫ్‌గా తెలంగాణ..
రాష్ట్రంలో 8 వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ తరగతులను సీఎం కేసీఆర్ మంగళవారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర హెల్త్ డైరెక్టర్.. సీఎం కేసీఆర్ పట్ల ప్రదర్శించిన అతి విధేయత చర్చనీయాంశమైంది. కేసీఆర్‌కు పుష్పగుచ్చంతో పాటు ఒక లెటర్‌ను అందించిన డైరెక్టర్ శ్రీనివాస్ సీఎం కాళ్లు మొక్కారు. కేసీఆర్ బయటికి వెళ్తుంటే మరోసారి ఆయన కాళ్లు మొక్కారు. ఈ విషయాన్ని పట్టించుకోకుండానే కేసీఆర్ ముందుకెళ్లారు. శ్రీనివాస్ తన పదవీ కాలాన్ని పెంచాలంటూ లేఖ ఇచ్చారని కొందరు.. కొత్తగూడెం ఎమ్మెల్యే టికెట్ కోరారని మరికొందరు అంటున్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ.. కేసీఆర్ హయాంలో బానిసత్వానికి కేరాఫ్‌గా మారిందని పలువురు విమర్శిస్తున్నారు.