కన్నబిడ్డలను కాదని కోటిన్నర ఆస్తిని ప్రభుత్వానికి రాసిచ్చేశాడు!
కనీ పెంచిన పిల్లలు తనను వదిలేశారన్న బాధతో 85 ఏళ్ల వృద్ధుడు… కోటిన్నర విలువైన ఆస్తిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి వీలునామాగా రాసిచ్చాడు. నాథూ సింగ్ తన శరీరాన్ని మెడికల్ కాలేజీకి దానం చేశాడు. అంతే కాదు… కొడుకు మరియు నలుగురు కుమార్తెలను తన అంత్యక్రియలకు హాజరుకానివ్వకూడదని చెప్పాడు. ముజఫర్‌నగర్‌లో నివసిస్తున్న నాథూ సింగ్‌కు ₹ 1.5 కోట్ల విలువైన ఇల్లు, స్థలం ఉంది. ఒక్కగానొక్క కొడుకు స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. సహరాన్‌పూర్‌లో నివసిస్తున్నాడు. నలుగురు కుమార్తెలకు వివాహం జరిగింది. భార్య చనిపోవడంతో వృద్ధుడు ఒంటరిగా ఉంటున్నాడు. ఏడు నెలల క్రితం స్వగ్రామంలోని ఓ వృద్ధాశ్రమానికి వెళ్లిన నాథూ సింగ్ అక్కడే జీవిస్తున్నాడు. 85 ఏళ్ల వృద్ధుడు, తన పెద్ద కుటుంబం నుండి ఎవరూ తనను కలవడానికి రాకపోవడంతో గుండెలు బాదుకున్నాడు.

తన భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి వీలునామాగా ఇచ్చేశాడు. మరణించిన తర్వాత అక్కడ ఆసుపత్రి లేదా పాఠశాలను నిర్మించమని ప్రభుత్వాన్ని కోరాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ, ఈ వయస్సులో, నేను నా కొడుకు, కోడలితో కలిసి జీవించాలి, కానీ వారు నన్ను బాగా చూసుకోలేదు. అందుకే ఆస్తిని ప్రభుత్వానికి రాసివ్వాలనుకుంటున్నానన్నాడు. విద్యార్థుల పరిశోధన కోసం తన శరీరాన్ని దానం చేయాలని నిర్ణయించుకున్నట్లు కూడా వీలునామాలో రాశాడు. 6 నెలల క్రితం నుంచి నాథూ సింగ్ వృద్ధాశ్రమంలోనే ఉంటున్నాడని… ఆయనను చూసేందుకు ఎవరూ రావడం లేదని… దీంతో చాలా బాధపడ్డాడని, తన ఆస్తిని రాష్ట్రానికి ఇవ్వడానికి మొండిగా ఉన్నాడని… మేనేజర్ రేఖా సింగ్ అన్నారు. నాథూ సింగ్ అఫిడవిట్ తమకు అందిందని, ఆయన మరణానంతరం అది అమల్లోకి వస్తుందని ఏరియా సబ్-రిజిస్ట్రార్ చెప్పారని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.

