Home Page SliderTelangana

‘ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు’..రేవంత్ రెడ్డి ఆదేశం

ఆగస్టు 15 వ తేదీన కాలధర్మం చెందిన  భారత రక్షణ వ్యూహాత్మక అగ్ని మిస్సైల్ రూపకర్త, భారత మిస్సైల్ కార్యక్రమ దిగ్గజం డా. రామ్ నారాయణ్ అగర్వాల్ అంత్య క్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.  హైదరాబాద్ లో ఆగస్టు 17 వ తేదీ శనివారం నాడు వీరి అంత్యక్రియలు జరుగనున్నాయి. రక్షణ రంగంలో డా. అగర్వాల్ చేసిన సేవలకు గుర్తింపుగా 1990 లో పద్మశ్రీ, 2000 లో పద్మ భూషణ్ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

 1983 లో భారత ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత ప్రతిష్టాత్మక భారత మిస్సైల్ కార్యక్రమంలో డా. అరుణాచలం, డా. ఏ.పీ.జె. అబ్దుల్ కలాం లతో కలసి డా. ఆర్.ఎం. అగర్వాల్ పనిచేశారు. హైదరాబాద్ లో అడ్వాన్సడ్ సిస్టమ్స్ లాబరేటరీ (ASL )వ్యవస్థాపక డైరెక్టర్ గా అగర్వాల్ పనిచేసారు. 2005 లో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (DRDO ) లో విశిష్ట శాస్త్ర వేత్తగా పదవీ విరమణ చేసిన డా. రామ్ నారాయణ్ అగర్వాల్ హైదరాబాద్ లో నివాసం ఏర్పరచుకొని చివరి వరకు రక్షణ రంగానికి సేవలందించారు. భారత లాంగ్ రేంజ్ మిస్సైల్ టెక్నాలజీ రంగంలో దేశం స్వయం ప్రతిపత్తి సాధించడంలో విశేష సేవలందించారు.