‘సీతమ్మకు నేయిస్తి బంగారు చీరలు రామచంద్రా’…
ఆనాడు శ్రీ రామదాసు భద్రాచలంలో సీతమ్మకు చింతాకు పతకం చేయిస్తే, ఇప్పుడు సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ సీతమ్మకు బంగారు చీర నేశాడు. శ్రీరామ నవమి రాబోతున్న సందర్భంగా ప్రత్యేకంగా పది రోజుల పాటు శ్రమించి పట్టు వస్త్రాలు నేశారు. ఈ చీర కొంగుపై భద్రాద్రి ఆలయ మూల విగ్రహాన్ని భక్తితో నేశారు. శంఖు, చక్రాలు, ఆంజనేయుడు, గరుత్మంతుడు రూపాలు కూడా చీర బోర్డరుపై ఉన్నాయి. ‘శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే…’ అనే శ్లోకాన్ని 51 సార్లు చీరపై రాశారు. వన్ గ్రామ్ గోల్డ్ జరీ పట్టుతో ఈ ఏడు గజాల చీరను నేశానని, ప్రతీ ఏటా సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు నేసే అవకాశం సిరిసిల్ల నేతన్నలకు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతున్నట్లు హరి ప్రసాద్ పేర్కొన్నారు.