Home Page SliderInternational

ఖాళీగా ఉంటూ.. రూ.2 కోట్లు సంపాదించాడు..

పని చేయకుండా డబ్బు సంపాదించడం కొంచెం గమ్మత్తుగా అనిపించవచ్చు. కానీ కొన్ని సార్లు, పని చేయడం లేదని అనిపించవచ్చు. వాస్తవానికి మీ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలంటున్నాడు జపాన్ దేశానికి చెందిన షోటి మోరిమోటో. డబ్బు సంపాదించడానికి మనం ఎంతో కష్టపడుతుంటాం. కానీ, కొందరు మాత్రం వారికొచ్చిన విచిత్రమైన ఆలోచనకు కార్యరూపం దాల్చి కోటీశ్వరులవుతారు. అలాంటి వారిలో ఒకరే ఈ ‘డూ నథింగ్ మ్యాన్’. ఎటువంటి పని చేయకుండా ఉంటూనే గంటకు సుమారు రూ. 5,500 వరకు సంపాదిస్తున్నాడు. వినడానికి విచిత్రంగా ఉందా? ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.

జపాన్ దేశానికి చెందిన ఈ వ్యక్తి అసలు పేరు ‘షోజి మోరిమోటో’. ఈయన గతంలో ఓ పబ్లిషింగ్ కంపెనీలో పని చేసేవాడు. అప్పుడు తోటి ఉద్యోగులే ఇతనికి ఏ పనీ చేతకాదంటూ ఎగతాళి చేస్తూ అవమానించేవారు. దీంతో ఆక్కడ జాబ్ మానేసి ఏం చేయకుండా ఉండటమే తన పనిగా ఎంచుకున్నాడు షోజి మోరిమోటో. అలా.. ఒంటరిగా ఫీల్ అయ్యే వారికి, సింగిల్ గా ఏ చోటుకైనా వెళ్లాలంటే భయపడేవారికి తోడుగా వెళ్లడం మొదలెట్టాడు. ఒకరితో గడపడానికి ఒక సెషన్ కు రూ.5,500 తీసుకుంటాడు. వీటితో పాటే రవాణా, ఆహార ఖర్చులు సైతం ఛార్జ్ చేస్తాడు. ఇలా అతని కంపెనీ కోరుకునేవారిలో రిపీటెడ్ కస్టమర్లే ఎక్కువగా ఉంటారట. ఒక వ్యక్తి అయితే 270 సార్లు ఇతణ్ని బుక్ చేసుకున్నారట. 4 సంవత్సరాల్లో 4 వేలకు పైగా బుకింగ్స్ తో షోజి మోరిమోటో ఇప్పటిదాకా దాదాపు రూ.2 కోట్ల వరకు సంపాదించాడు.