‘జగన్ చెప్పినా వినట్లేదా’…వైసీపీకి మాజీ మంత్రి షాక్
వైసీపీ పార్టీకి మరో షాక్ తగలనున్నట్లు గట్టిగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు పార్టీకి రాజీనామా చేసి, టీడీపీలో చేరారు. అయితే వైసీపీ నేత జగన్‌కు బంధువు, మాజీమంత్రి అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఝలక్ ఇచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఈ విషయం ఆయనే స్వయంగా సన్నిహితులకు చెప్పారట. జగన్‌తో జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయని సమాచారం. నాయకత్వం పట్ల ఆయన అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. 2012లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, వైసీపీలో చేరిన బాలినేని అప్పటి నుండి వైసీపీకి అన్నిరకాలుగా వెన్నుముకగా ఉన్నారు. ఒంగోలు నుండి ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన 2019లో రెండున్నరేళ్లు మంత్రిగా పనిచేశారు. అనంతరం పదవి తొలగించడంతో పార్టీలో క్రియాశీలకంగా పనిచేయలేదు. అప్పట్లో జగన్ బుజ్జగింపులతో శాంతించినా ఇప్పుడు మాత్రం తగ్గేదే లేదంటున్నారు. గత ఎన్నికలలో కూడా ఆయనకు ఒంగోలు స్థానం కేటాయించకపోవడంతో ఆయన వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నారు. టీడీపీతో ఆయనకు సత్సంబంధాలు లేకపోవడంతో జనసేనలో చేరుతారని ప్రచారం జరుగుతోంది.


 
							 
							