టిటిడి నిధులు మున్సిపల్ కార్పొరేషన్‌కు మళ్లించడంపై హైకోర్టు స్టే
తిరుమల తిరుపతి దేవస్థానముల ట్రస్ట్(టిటిడి) నిధులను తిరుపతి పట్టణ మున్సిపల్ కార్పొరేషన్‌కు మళ్లించడంపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. టిటిడి ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయమైన తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన అన్ని వ్యవహారాలను చూసుకుంటుంది. విరాళాలు, హుండీ నిధులు, కానుకల రూపంలో టిటిడీకి ప్రతిరోజూ కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఏపీ ప్రభుత్వం, టిటిడి అధికారులతో కుమ్మకై ఎండోమెంట్ యాక్ట్‌కు విరుద్ధంగా టిటిడి నిధులను మున్సిపల్ కార్పొరేషన్‌కు మళ్లిస్తోందని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. దీనిపై విచారించిన కోర్టు తక్షణమే టెండర్ ఫైనల్ చేసినా సరే నిధుల విడుదలను ఆపాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై టిటిడి అధికారులను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా పడింది.

