‘పిల్లలను కనండి-ట్యాక్స్ తప్పించుకోండి’..హంగేరీలో బంపర్ ఆఫర్
ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ హంగేరీ ప్రభుత్వం పౌరులను వేడుకుంటోంది. నలుగురు లేదా అంతకంటే పిల్లలు ఎక్కువగా ఉంటే ఆదాయపు పన్ను కూడా కట్టాల్సిన అవసరం లేదంటూ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఓ పక్క భారత్ లాంటి దేశాలలో జనాభా పెరిగిపోతుంటే, కొన్ని దేశాలు మాత్రం జనాభా క్షీణతతో బాధపడుతున్నాయి. కొన్ని దేశాలలో ప్రజలు పెళ్లి, పిల్లలు లాంటి బంధాలపై ఆసక్తి చూపకపోవడంతో వారి జనాభా క్షీణిస్తోంది. హంగేరీ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. ఆర్థిక, వృత్తిపరమైన ఒత్తిడి కారణంగా యువత పెళ్లిపై నిరాసక్తతో ఉంది. దీనితో జనాభాను పెంచుకునే చర్యలు ప్రారంభించింది హంగేరీ ప్రభుత్వం. సాక్షాత్తూ దేశ ప్రధానమంత్రే ఎక్కువ సంతానం ఉన్నవారు జీవితాంతం ఆదాయపు పన్ను కట్టనక్కరలేదని ప్రకటించారు. అంతేకాదు, పిల్లల పెంపకానికి దేశవ్యాప్తంగా 21 వేల క్రెచ్‌లను ప్రారంభించారు. పెద్ద కుటుంబాలకు పెద్ద కార్లు కొనుగోలు చేసేందుకు సబ్సిడీలు కూడా ఇస్తున్నారు. 40 ఏళ్ల లోపు పెళ్లి చేసుకునే అమ్మాయిలకు 10 మిలియన్ ఫోరింట్స్ సబ్సిడీ రుణాలు ఇచ్చి, వారికి ఇద్దరు పిల్లలు జన్మిస్తే మూడోవంతు, ముగ్గురు కంటే ఎక్కువ సంతానం కలిగితే మొత్తం రుణాన్ని మాఫీ చేస్తామని ఆఫర్లు ఇస్తున్నారు. ప్రస్తుతం హంగేరీ జనాభా 96 లక్షలు ఉంది. అంటే కోటి కంటే తక్కువే.