ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న హార్దిక్-రిజ్వాన్ హగ్
క్రికెట్ రెండు దేశాలను కలుపుతుంది. అవును నిజం క్రికెట్ రెండు దేశాల ప్రజలను ఏకం చేస్తోంది. విభజన తర్వాత భారత్-పాక్ రెండు దేశాలు ఎంతో నష్టపోయాయ్. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాయ్. కానీ క్రికెట్ మాత్రం రెండు దేశాల మధ్య ఎంతో ఆసక్తి పెంచుతూనే ఉంది. దుబాయ్ కేంద్రంగా జరిగిన ఆసియా కప్‌లో టీమ్ ఇండియా ప్లేయర్ హార్దిక్ పాండ్య, పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్‌మెన్ , వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వన్‌కు ఇచ్చిన హగ్ రెండు దేశాల్లోనూ వైరల్ న్యూస్ అయ్యింది. గతంలో ఉన్న రోషాలు ఇప్పుడు ఏమాత్రం కన్పించకుండా ఒకర్ని ఒకరు అభినందించుకున్న తీరు రెండు దేశాల ప్రజల మనసులు గెలుచుకునేలా చేశాయ్. 17 బంతులకే 33 పరుగులు చేసి సత్తా చాటిన హార్దిక్ క్రికెట్ ప్రేమికులను సంభ్రమాశ్చర్యానికి గురిచేశాడు.

4 బంతుల్లో ఆరు పరుగులు చేయాల్సిన సమయంలో హార్దిక్… పరుగు చేయకుండా డాట్ బాల్ కావడంతో ఉత్కంఠ అంతకంతకూ పెరిగింది. ఐతే క్రీజ్ లో ఉన్న దినేష్ కార్తీక్‌కు కూల్‌గా ఉండు భాయ్… మ్యాచ్ నేను ఫినిష్ చేస్తానన్న సంకేతాలిచ్చాడు హార్దిక్. ఆ తర్వాత బంతిని హార్దిక్ సిక్సర్ బాదడంతో ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమయ్యింది. పాకిస్తాన్ పై భారత్ చిరస్మరణీయమైన విజయాన్ని సొంతం చేసుకొంది. ఇదే సమయంలో రిజ్వాన్ కు హార్దిక్ ఇచ్చిన హగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

