‘హ్యాపీ బర్త్‌డే’ టు చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ముఖ్య భూమిక పోషించిన రాజకీయవేత్త, మాజీముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మదినం నేడు. ఏప్రిల్ 20, 1950 వసంవత్సరంలో ఈయన ఓ రైతు కుటుంబంలో చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో జన్మించారు. ఈ పుట్టినరోజున 74 వ వసంతంలో అడుగుపెట్టిన ఆయనకు దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. తిరుపతిలో వేంకటేశ్వర కాలేజీలో చదివే రోజులలోనే ఆయన రాజకీయాలలో ప్రవేశించారు. యూనివర్సిటీలో విద్యార్థి నాయకునిగా పేరు పొందారు. దేశ రాజకీయాలకు ఆకర్షితుడై, కాంగ్రెస్ పార్టీలో చేరారు.

1978లో చంద్రగిరి నియోజకవర్గం నుండి పోటీచేసి, ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాకుండా, అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య మంత్రివర్గంలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అతిచిన్న వయస్సులోనే మంత్రి అయిన రికార్డును సాధించుకున్నారు. ఈ పదవిలో ఉన్నప్పుడే సుప్రసిద్ధ నటులు ఎన్టీరామారావుని కలుసుకున్నారు. అనంతరం ఆయన కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకుని, ఆయనకు అల్లుడయ్యారు.

ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలకపాత్ర పోషించారు. ఎన్టీఆర్ మరణానంతరం పార్టీ పగ్గాలు చేపట్టి, టీడీపీ పార్టీని ముందుకు నడిపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పాలించిన ఘనత చంద్రబాబునాయుడుదే. ఏకంగా 9 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆకాలంలో రాజధాని హైదరాబాదు రూపురేఖలు మార్చేసారు. ఐటీ రంగంలో హైదరాబాదును అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారు. విశ్వనగరంగా అభివృద్ధి చేశారనే చెప్పాలి. ఈయన హయాంలో ఏర్పడిన మైక్రోసాఫ్ట్, టీసీఎస్, విప్రో లాంటి మల్టినేషనల్ కంపెనీలు నగరాన్ని హైటెక్ సిటీగా మార్చేసాయి. విజన్ 2020 పేరుతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.

రాష్ట్రరాజకీయాలలోనే కాకుండా దేశరాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేశారు. యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా పనిచేస్తూ దేశ ప్రధానులను కూడా నిర్ణయించే స్థాయికి ఎదిగారు. వాజపేయిని ప్రధానిగానూ, అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగానూ చేయడంలో చంద్రబాబునాయుడి పాత్ర ఎంతైనా ఉందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014లో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు మొదటి ముఖ్యమంత్రిగా అమరావతి నగర నిర్మాణానికి అంకురార్పణ చేశారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది.

అయితే 2019లో వైసీపీ పార్టీ నాయకుడు జగన్ ముఖ్యమంత్రి కావడంతో ప్రస్తుతం ప్రతిపక్షనాయకుని హోదాలో ఉన్నారు చంద్రబాబు. ఆయనను ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి. ఇండియా టుడే వారి ‘ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియమ్’ అవార్డు, ‘సెవెన్ వర్కింగ్ వండర్స్ ఎరౌండ్ ది ఇయర్’ అవార్డు, ‘ఆదర్శముఖ్యమంత్రి పురస్కారం’ వంటి ఎన్నో పుస్కారాలు గెలుచుకున్నారు. ఇప్పటికీ 74 ఏళ్ల వయస్సులో కూడా నిర్విరామంగా పనిచేస్తూ, రాష్ట్రమంతా పర్యటిస్తూ తెలుగుదేశం పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబునాయుడు. ఈరోజు ఆయన పుట్టిన రోజును తెలుగుదేశం పార్టీ వారే కాక, ఐటీ కంపెనీల వారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ జరుపుకుంటున్నారు.

