H-1B వీసా ఏడాదిపాటు నిలిపివేత
ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన విదేశీ నిపుణులను నియమించుకునే హెచ్-1బీ వీసాలపై అమెరికా మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తులను ఏడాదిపాటు నిలిపివేయాలని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు మంగళవారం స్పష్టమైన ఆదేశాలు పంపించారు. ఈ నిలిపివేత చర్యలు 2027 మే 31 వరకు అమల్లో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
హెచ్-1బీ వీసాలు భారీగా దుర్వినియోగం అవుతున్నాయని, అమెరికన్ ఉద్యోగాలు ముందుగా యూఎస్ కార్మికులకే దక్కాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ అబాట్ వెల్లడించారు. ఫెడరల్ వీసా హోల్డర్ల నియామకాలకు సంబంధించి భవిష్యత్తులో చట్టపరమైన పరిమితులు విధించేందుకు ఈ విరామం అవసరమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఫెడరల్ చట్టాలను సవరించడానికి, ట్రంప్ పరిపాలన వీసా దుర్వినియోగాన్ని అరికట్టే సంస్కరణలు అమలు చేయడానికి ఇది అవకాశం కల్పిస్తుందని అబాట్ వ్యాఖ్యానించారు.
హెచ్-1బీ వీసా కింద అమెరికన్ కార్మికులను తొలగించి తక్కువ వేతనాలకు విదేశీయులను నియమిస్తున్నారన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ సమీక్ష చేపట్టినట్లు అబాట్ తెలిపారు. అందుకే కొత్త వీసా పిటిషన్లను వెంటనే నిలిపివేయాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. గతేడాది కొత్తగా, పునరుద్ధరించిన హెచ్-1బీ వీసాల వివరాలు, స్పాన్సర్ చేస్తున్న ఉద్యోగుల సంఖ్య, ఉద్యోగ హోదాలు, వీసా గడువు తేదీలను సమర్పించాలని ఆయా సంస్థలను ఆదేశించారు.
టెక్సాస్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ టెక్సాస్ కార్మికుల ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయాలని, పన్ను చెల్లింపుదారుల నిధులతో నడిచే ఉద్యోగాలు మొదట రాష్ట్ర ప్రజలకే దక్కేలా టెక్సాస్ ఆదర్శంగా నిలవాలని గవర్నర్ అబాట్ అన్నారు. టెక్సాస్ వర్క్‌ఫోర్స్ కమిషన్ అనుమతిస్తే కొన్ని మినహాయింపులు ఇవ్వవచ్చని పేర్కొన్నారు.
గతేడాది ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ హెచ్-1బీ వీసా దుర్వినియోగంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రత్యేక నైపుణ్యం అవసరం లేని ఉద్యోగాలకు కూడా ఈ వీసాలను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఫ్లోరిడా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల వ్యవస్థను పర్యవేక్షించే బోర్డ్ ఆఫ్ గవర్నర్స్, వచ్చే ఏడాది వరకు కొత్త హెచ్-1బీ నియామకాలను నిలిపివేయాలా అనే అంశంపై చర్చించనుంది.
యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ గణాంకాల ప్రకారం, హెచ్-1బీ వీసా హోల్డర్లు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో కాలిఫోర్నియా తర్వాత టెక్సాస్ రెండో స్థానంలో ఉంది. 2025లో 6,100 యజమానుల వద్ద పనిచేసేందుకు 40 వేల మందికి పైగా హెచ్-1బీ వీసాలు మంజూరయ్యాయి. టెక్సాస్ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో మాత్రమే సుమారు 1,200 మంది హెచ్-1బీ ఉద్యోగులు పనిచేస్తున్నారు.
1990లో ప్రారంభమైన హెచ్-1బీ వీసా కార్యక్రమం, అమెరికాలో నైపుణ్యం కొరత ఉన్న రంగాల్లో విదేశీ నిపుణులను నియమించుకునేందుకు ఉద్దేశించబడింది. తాజాగా తీసుకుంటున్న ఈ నిర్ణయాలు, అమెరికా వీసా విధానాల్లో కఠినతరం సంకేతంగా భావిస్తున్నారు.

