నూతన సీఈసీగా జ్ఞానేశ్ కుమార్
కేంద్ర ఎన్నికల సంఘం 26వ ప్రధాన కమిషనర్ గా జ్ఞానేశ్ కుమార్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల సంఘం సభ్యుల నియామక చట్టం 2023 ప్రకారం ఎంపికైన తొలి సీఈసీ ఈయన. 2029 జనవరి 26 వరకు జ్ఞానేశ్ కుమార్ ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. జ్ఞానేశ్ కుమార్ కేరళ కేడర్ చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గతంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలోని సహకార మంత్రిత్వ శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల కార్యదర్శిగా పనిచేసిన రిటైర్ అయ్యారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటుతో సహా అయోధ్య కేసుపై సుప్రీం కోర్టు తీర్పునకు సంబంధించిన అన్ని విషయాలను చూసేందుకు హోం మంత్రిత్వ శాఖలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగానికి జ్ఞానేశ్ కుమార్ నాయకత్వం వహించారు. రాజీవ్ కుమార్ పదవీ కాలం ముగియడంతో సీఈసీగా జ్ఞానేశ్ కుమార్ , ఎలక్షన్ కమిషనర్ గా వివేక్ జోషి పేర్లను త్రి సభ్య కమిటీ రాష్ట్రపతికి సిఫారసు చేసింది. రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము ఆమోదంతో నూతన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ గా జ్ఞానేశ్ కుమార్ నియమితులయ్యారు.