Breaking NewsHome Page Sliderhome page sliderTelangana

బీఆర్ఎస్ నాయకులకు గులాబీబాస్ దిశానిర్దేశం

బీఆర్‌ఎస్‌ (BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లో పార్టీ కీలక నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీ వ్యూహం, ప్రచార రీతులు, స్థానిక రాజకీయ పరిణామాలు తదితర అంశాలపై గురువారం ఆయన విస్తృతంగా చర్చించారు.
మాగంటి గోపీనాథ్‌ మరణంతో అనివార్యంగా వచ్చిన ఈ ఉప ఎన్నికలో, ఆయన భార్య మాగంటి సునీత గెలుపు జూబ్లీహిల్స్‌ ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల వద్దకు వెళ్లి వారితో మమేకమవుతూ, కాంగ్రెస్‌ పార్టీ దోపిడీ పాలనను ప్రజలకు అవగాహన కల్పించాలని, భారీ మెజారిటీ కోసం ప్రతి నాయకుడు కృషి చేయాలని ఆయన సూచించారు.

ప్రజలను నమ్మించి మోసం చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి క్షీణించి, ఆర్థిక పరిస్థితులు ప్రమాదకర స్థాయికి చేరాయని ఆయన పేర్కొన్నారు. “నేటి పాలనలో ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్‌ హయాంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ కలిసినపుడు రాష్ట్రం అభివృద్ధి పథంలో నడిచింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది” అని కేసీఆర్‌ అన్నారు.

మాగంటి సునీత భారీ మెజారిటీతో గెలవడం కోసం అవసరమైన వ్యూహాలు, ప్రచార ఎత్తుగడలపై కేసీఆర్‌ నేతలతో చర్చించారు. జూబ్లీహిల్స్‌లో ప్రజల మనసులు గెలుచుకునే విధంగా బలమైన బూత్‌ స్థాయి నెట్‌వర్క్‌ నిర్మించాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లపాటు అమలు చేసిన పథకాలు, ప్రజల జీవితాలను మార్చిన సంక్షేమ కార్యక్రమాలు – ఇవి కాంగ్రెస్‌ పాలనలో ఎందుకు నిలిచిపోయాయో ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని ఆయన నేతలకు ఆదేశించారు.

జూబ్లీహిల్స్‌ ప్రజలు రాజకీయంగా చైతన్యవంతులని, రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో ముందుండే వారు అని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. “జూబ్లీహిల్స్‌ గౌరవాన్ని కాపాడి, కాంగ్రెస్‌ అభ్యర్థిని చిత్తుగా ఓడించి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతను భారీ మెజారిటీతో గెలిపిస్తారు” అని ఆయన నమ్మకంగా పేర్కొన్నారు.
ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎన్నికల వ్యూహకర్తలు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితం పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపనుందన్న నేపథ్యంలో కేసీఆర్‌ స్వయంగా వ్యూహ రూపకల్పనకు తానే ముందుకు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.