జూబ్లీహిల్స్ లో ప్రచారానికి గులాబీ బాస్
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గెలుపుకై బీఆర్ఎస్ సర్వశక్తులు పెట్టి పోరాడుతుంది . అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కోసం గులాబీ బాస్ కేసీఆర్ ప్రచారానికి వస్తున్నట్లు ప్రచారం . జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అభ్యర్థులు ఖరారు కావడంతో ప్రధాన పార్టీలు ప్రచారానికి వేగం పెంచాయి. సిట్టింగ్ సీటు కావడంతో బీఆర్ఎస్ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. పార్టీ భవిష్యత్తు పరంగా కీలకంగా మారిన ఈ బై ఎలక్షన్‌లో గెలుపు సాధించాలనే ధ్యేయంతో బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా కదులుతోంది.
దివంగత నేత మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీతను తమ అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంగళవారం ఆమెకు బి-ఫామ్ అందజేశారు. బుధవారం కేటీఆర్‌తో కలిసి సునీత నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రచార యంత్రాంగం పూర్తిగా యాక్టివ్ మోడ్‌లోకి వెళ్లింది.
ప్రచార వేదికపైకి కేసీఆర్?
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎల్కతుర్తిలో జరిగిన రజతోత్సవ సభ తర్వాత రాజకీయ రంగంలో ప్రత్యక్షంగా కనిపించని మాజీ సీఎం కేసీఆర్, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ప్రచారంలో పాల్గొనబోతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఈ నెల 19న బీఆర్ఎస్ భారీ స్థాయిలో రోడ్‌షో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. అందులో కేసీఆర్ కూడా పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. మాగంటి సునీతకు బి-ఫామ్ అందజేసే సమయంలో, “నేను స్వయంగా ప్రచారానికి వస్తా, ధైర్యంగా ముందుకు సాగండి” అని కేసీఆర్ చెప్పినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
కేసీఆర్ ఈ ప్రచారంలో పాల్గొంటే దాదాపు ఆరు నెలల తర్వాత ఆయన ప్రజాక్షేత్రంలో ప్రత్యక్షం అవుతారు. బీఆర్ఎస్ కార్యకర్తలు “కేసీఆర్ ఒక్కసారి ప్రచారానికి వస్తే సరిపోతుంది” అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన స్వయంగా పాల్గొంటారా, లేక కేటీఆర్–హరీశ్ రావులే ప్రచార బాధ్యతలు చేపడతారా అనేది చూడాలి.