పెళ్లికొడుకు రాష్ డ్రైవింగ్..మహిళ మృతి
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్‌పల్లిలో గురువారం రాత్రి ఒక పెళ్లి బారాత్‌లో దారుణం చోటు చేసుకుంది. పెళ్లికొడుకు అశోక్ నడిపిన కారు ఒక మహిళ ప్రాణం బలిగొంది. మెట్‌పల్లికి చెందిన నవ్య వివాహం మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామానికి చెందిన అశోక్‌తో గురువారం జరిగింది. ఈ వేడుకలో భాగంగా బారాత్ నిర్వహించారు. కారులో వధూవరులు కూర్చుని ఉండగా, డ్రైవర్‌కు ఫోన్ రావడంతో కారు దిగి రోడ్డు పక్కన మాట్లాడుతున్నాడు. ఈ మధ్యలో పెళ్లికొడుకు కారును నడపడానికి ప్రయత్నించగా, అదుపు తప్పి అతివేగంతో బారాత్‌ను తిలకిస్తున్న 12 మందిపై దూసుకెళ్లింది. దీనితో పలువురికి గాయాలయ్యాయి. వారిలో ఉమ(35), ఆమె కుమార్తె నిఖితలకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీనితో ఉమను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగై వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా ఆమె శుక్రవారం ఉదయం మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.