ఆర్డీసీ లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
తెలంగాణ ఆర్డీసీ లో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల నియామక ప్రక్రియకు సంబంధించి ఎస్సీ కుల ధ్రువపత్రాలపై రాష్ట్ర పోలీసు నియామక మండలి స్పష్టత ఇచ్చింది. మొత్తం 1,000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టుల భర్తీ కోసం సెప్టెంబర్ 17న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఆన్‌లైన్ దరఖాస్తులు ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి.
టీఎస్ఎల్‌పీఆర్‌బీ చైర్మన్ ఐపీఎస్ వి.వి. శ్రీనివాసరావు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో, షెడ్యూల్ కులాలకు చెందిన అభ్యర్థులు తప్పనిసరిగా కొత్త ఫార్మాట్‌లోనే ఎస్సీ కుల ధ్రువపత్రాలు కలిగి ఉండాలని స్పష్టం చేశారు. నూతన చట్టం ప్రకారం తహసీల్దార్ లేదా మీ సేవా కేంద్రాల ద్వారా కొత్త ఫార్మాట్‌లో కుల ధ్రువపత్రాలు పొందాలని సూచించారు.
ఇప్పటికే ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ అన్ని జిల్లా కలెక్టర్లకు సూచనలు జారీచేశారు. కొత్త ఫార్మాట్‌లో సామాజిక వర్గం ఉపవర్గం (గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3) వివరాలు స్పష్టంగా ఉండాలని, ఆ ఫార్మాట్‌లోనే కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని ఆదేశించారు.
దరఖాస్తు సమయంలో కొత్త ఫార్మాట్‌లో సర్టిఫికేట్ లేకపోతే అభ్యర్థులు తాత్కాలికంగా పాత ధ్రువీకరణ పత్రాన్ని అప్‌లోడ్ చేయవచ్చు, అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో మాత్రం కొత్త ఫార్మాట్‌లో ఉన్న ధ్రువీకరణ పత్రం తప్పనిసరి అని స్పష్టం చేశారు. వెరిఫికేషన్ సమయంలో కొత్త ఫార్మాట్ ధ్రువీకరణ పత్రం సమర్పించని అభ్యర్థులను ఎస్సీ కేటగిరీగా పరిగణించబోమని టీఎస్ఎల్‌పీఆర్‌బీ స్పష్టంగా తెలిపింది.