Home Page SliderNational

రాహుల్ గాంధీ పాస్‌పోర్ట్‌కు గ్రీన్ సిగ్నల్

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విదేశీ ప్రయాణానికి మార్గం అనుకూలమైంది. ఆయనకు కొత్తపాస్‌పోర్ట్ జారీచేయడానికి కోర్టు అంగీకరించి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇటీవల రాహుల్ గాంధీ అమెరికా పర్యటన కోసం పాస్‌పోర్టు కోసం ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. గతంలో మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యల కారణంగా సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలుశిక్ష కారణంగా ఆయన లోక్ సభ సభ్యత్వం రద్దయ్యింది. దీనితో అతని పాస్‌పోర్టు, దౌత్యహోదా కోల్పోయి, వాటిని సంబంధిత అధికారులకు అప్పగించారు. అందుకే సాధారణ పాస్‌పోర్టు కోసం అప్లయి చేసుకున్నారు. అయితే గతంలోని నేషనల్ హొరాల్డ్ కేసు కారణంగా పాస్‌పోర్టు జారీ కోసం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావలసి వచ్చింది. అయితే  రాహుల్‌పై నేషనల్ హొరాల్డ్ కేసు వేసిన బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఈ పాస్ పోర్టు ఇవ్వడానికి వ్యతిరేకించారు. రాహుల్‌కు పాస్ పోర్టు లభించినట్లయితే అది నేషనల్ హొరాల్డ్ కేసుపై ప్రభావం చూపిస్తుందని వాదించారు. అయితే కోర్టు ఈ వాదనలు త్రోసిపుచ్చి, రాహుల్‌కు మూడేళ్ల కాలానికి నిరభ్యంతర పత్రాన్ని జారీ చేసింది. రాహుల్ గాంధీ మే 31 నుండి పది రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు.