Home Page SliderTelangana

భద్రాచలం – మల్కాన్ గిరి నూతన రైల్వేలైన్‌కు గ్రీన్ సిగ్నల్..

భద్రాచలం – మల్కాన్ గిరి నూతన రైల్వేలైన్ కు ఆమోదం లభించింది. దీని పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలియజేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దేశవ్యాప్తంగా రైల్వే కనెక్టివిటీని మరింత బలోపేతం చేయాలన్న ఉద్దేశ్యంతో 7 రాష్ట్రాలకు లబ్ధి చేకూర్చేలా రూ. 24,657 కోట్ల అంచనా వ్యయంతో 800 కి. మీ. ల పొడవున నిర్మించనున్న 8 నూతన రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతూ ఈ నెల 9 వ తేదీన జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. దీనిలో రూ.4,109 కోట్ల అంచనా వ్యయంతో 173 కి. మీ. ల పొడవున నిర్మించనున్న భద్రాచలం – మల్కాన్ గిరి నూతన రైల్వే లైన్ ప్రాజెక్టు కూడా ఉండటంతో తెలంగాణ రాష్ట్రానికి కూడా పెద్దఎత్తున లబ్ధి చేకూరనుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భద్రాచలం పట్టణానికి నూతన రైల్వే లైన్ డిమాండ్ ఈ ప్రాజెక్టుతో నెరవేరనుంది. ఈ ప్రాజెక్టు కారణంగా ఇప్పటి వరకూ ఎటువంటి రైల్వే సౌకర్యం లేని అనేక ప్రాంతాలకు నూతనంగా రైల్వే సౌకర్యాలు అందుబాటులోకి రావడంతోపాటు ఆయా ప్రాంతాలు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధిని సాధించనున్నాయి. అంతేకాకుండా ఈ నూతన ప్రాజెక్టు వలన తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్, ఒడిషా రాష్ట్రాల మధ్యన ప్రజల రాకపోకలు పెరగడమే కాకుండా ఆయా ప్రాంతాలు వ్యవసాయం, వాణిజ్యం, విద్య, పర్యాటకం, ఆరోగ్య సంరక్షణ వంటి వివిధ రంగాలలో వృద్ధిని సాధించడానికి కూడా ఉపయోగపడుతుంది. రైల్వే బడ్జెట్ కేటాయింపులలో కూడా తెలంగాణ రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతోంది. 2023-24 బడ్జెట్ లో తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి రూ. 4,418 కోట్లు కేటాయించగా, 2024-25 బడ్జెట్ లో రూ. 5,336 కోట్లు కేటాయించారు.

* భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని మెయిన్ లైన్ రైల్ నెట్ వర్క్ తో అనుసంధానం చేయనున్న నూతన ప్రాజెక్టు

* 01.04.2024 నాటికి తెలంగాణ రాష్ట్రంలో వివిధ దశలలో ఉన్న రూ. 32,946 కోట్ల విలువైన 2,298 కి.మీ. పొడవు గల 20 రైల్వే ప్రాజెక్టులు

* 2023-24 బడ్జెట్ లో తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి రూ. 4,418 కోట్లు కేటాయించగా, 2024-25 బడ్జెట్ లో రూ. 5,336 కోట్లు కేటాయింపు

* 2009-14 మధ్యన సంవత్సరానికి సగటున 17.4 కి. మీ. చొప్పున 87 కి. మీ. ల రైల్వే లైన్లు అందుబాటులోకి రాగా, 2014-24 మధ్యన 3.7 రెట్లు ఎక్కువగా సంవత్సరానికి సగటున 65 కి. మీ. చొప్పున      650 కి. మీ. ల రైల్వే లైన్లు అందుబాటులోకి వచ్చాయి.