‘ఆరా ఫౌండేషన్’ ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో గొప్ప ‘ఇఫ్తార్’ విందు
పేదవారికి, బడుగువర్గాల ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలిచే ‘ఆరాఫౌండేషన్’ వారు ఈ నెల 16న చిలకలూరిపేటలో గొప్ప ‘ఇఫ్తార్’ విందును ఏర్పాటు చేయనున్నారు. స్థానిక పాత సంత పక్కన ఉన్న గోల్కొండ గార్డెన్స్ దీనికి వేదిక కాబోతోంది. ఈ సందర్భంగా ‘ఆరా ఫౌండేషన్’ సంస్థ చైర్మన్ షేక్ మస్తాన్ గారు రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్నముస్లిం సోదరులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని,దీనికోసం దగ్గరలోని మసీదుల వద్ద పాసులను తీసుకోమని విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాస్టర్ మోటివేటర్ బ్రదర్ షఫీగారిచే ఆధ్యాత్మిక సందేశం కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఖురాన్ సిద్దాంతాన్ని అనుసరించి తాము సంపాదించిన దానిలో పేదవారి కోసం విధిగా దానధర్మం చేయాలనే సిద్ధాంతాన్ని అమలు చేస్తున్న ‘ఆరా ఫౌండేషన్’ కృషి ఎంతో ప్రశంసనీయం. ఈ మాసంలో ఉండే ఉపవాస దీక్షల వలన బలహీనతలను, వ్యసనాలను జయించవచ్చని ఇస్లాం గురువుల వాక్కు.

ముస్లింలు అనుసరించే చాంద్రమానం ప్రకారం ఇస్లామీయ క్యాలెండర్‌లోని తొమ్మిదవ నెలనే ‘రమదాన్’ అంటారు. కొందరు ‘రంజాన్’ అని కూడా పిలుస్తారు. పవిత్ర గ్రంథమైన ఖురాన్ ఈ నెలలో అవతరించిన కారణంగా ఈ నెలను పరమ పవిత్రంగా భావిస్తారు ముస్లిం సోదరులు. ఈ పండుగకు మరోపేరు ‘ఈద్ ఉల్ ఫిత్ర’. ఈ నెలలో వారు భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు చేస్తారు. ఈ సంవత్సరం చంద్రదర్శనం ఆధారంగా ఏప్రిల్ 22 లేదా ఏప్రిల్ 23 ఈ పండుగ వస్తుంది. దీనికి నెలరోజుల ముందు నుండి ఉపవాసాలు మొదలుపెడతారు. సూర్యోదయానికి ముందే ఆహారం తీసుకుంటారు. తిరిగి సూర్యాస్తమయం తర్వాతే ఉపవాసం విరమిస్తారు. ఈ మధ్య సమయంలో నీరు కూడా తీసుకోకుండా కఠిన ఉపవాసదీక్ష చేస్తారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతన ప్రజలలో కలుగజేయడమే ‘రమదాన్’ పండుగ సిద్ధాంతం.

